వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత
వరంగల్ క్రైం/విద్యారణ్యపురి: రాజ్యాంగం కల్పించిన హక్కులతోపాటు పౌరులు బాధ్యతలను కూడా తెలుసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘హర్ ఘర్ తిరంగా’పై రెండు రోజుల ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అండ్ ఔట్‌రీచ్ ప్రోగ్రాం, ఫొటో ఎగ్జిబిషన్‌ను సీపీ, కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడడంతోపాటు దేశ అభివృద్ధిలో యువత క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని కోరారు. రాజ్యాంగంలో రాసుకున్న హక్కులు, బాధ్యతలను ఇలాంటి కార్యక్రమాలు గుర్తు చేస్తాయని ఆమె వివరించారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు క్విజ్, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ రజినీలత, ప్రోగ్రాం ఇన్‌చార్జ్ సమత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


