వరంగల్ క్రైం: ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం వరంగల్ సీపీ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న రాష్ట్ర డీజీపీ సీవీ.ఆనంద్‌కు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత పూల మొక్క అందించారు. ఈసందర్భంగా సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన డీజీపీని జనగామ కలెక్టర్, తెలంగాణ ఎన్పీడీసీఎల్ సీఎండీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకొని మొక్కలు అందించారు.
హన్మకొండ: హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో రేపు (సోమవారం) నిర్వహించనున్న జిల్లా స్థాయి రైతు మేళా–26ను విజయవంతం చేయాలని హనుమకొండ జిల్లా వ్యవసాయాధికారి వి.విజయ చంద్ర రైతులకు పిలుపునిచ్చారు. రైతులకు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన సాగు పద్ధతులు, ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, అధిక దిగుబడులు సాధించే విధానాలపై అవగాహన కల్పించేందుకు రైతు మేళా నిర్వహిస్తున్నట్లు శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాసీ్త్రయ పరిష్కారాలు, సాగులో ఎదురవుతున్న సవాళ్లపై నిపుణులతో అవగాహన కల్పించనున్నట్లు తెలిపా రు. రైతు మేళాలో మట్టి పరీక్షలు, సాయిల్ ప్రొఫైలింగ్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని వివిధ కార్యక్రమాలు, ఎరువులు–విత్తనాల వినియోగం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై రైతులకు వివరించనున్నట్లు తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులు పాల్గొని రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తారన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై రైతులకు సమగ్ర సమాచారం అందించడంతో పాటు, ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలో వినియోగించుకునేలా ప్రోత్సహించడ మే రైతు మేళా ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్, కేజీబీవీ, గురుకులాలు, ప్రైవేట్ పాఠశాలల సైన్స్, గణిత పాఠశాలల ఉపాధ్యాయులకు ఈనెల 11న ఓరియంటేషన్ నిర్వహించనున్నట్లు డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్‌స్పైర్ మనాక్ అవార్డుల ఆన్‌లైన్ నామినేషన్లు, నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్, బాలశాస్త్రవేత్తల రిజిస్ట్రేషన్, నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ కాంపిటేషన్, ఏక్‌పేడ్ మాకేనామ్, ఖాన్ అకాడమీ, అటల్ టింకరింగ్ లాబొరేటరీ నిర్వహణ, ఇతర డిజిటల్ అభ్యాస కార్యక్రమాలపై హనుమకొండ సుబేదారిలోని రామన్ హైస్కూల్‌లో ఓరియంటేషన్ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక పాఠశాల నుంచి సైన్స్ లేదా గణిత ఉపాధ్యాయుడు ఒక్కరు మాత్రమే హాజరుకావాలని, ఉదయం 9:15 గంటలకు రామన్ హైస్కూల్‌లో ఆయా ఉపాధ్యాయులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
వరంగల్ అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్
హన్మకొండ: జీవితం ఎంతో విలువైందని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యకు పాల్ప డొద్దని, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని వరంగల్ అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్ పిలుపునిచ్చారు. హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో ఆత్మహత్యల నివారణ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఫల్యాలను చూసి కుంగిపోకుండా వాటిని అధిగమించి నిలిచి గెలిచినప్పుడే జీవితంలో నిజమైన ఘనత సాధించినట్లవుతుందని చెప్పారు. ఆత్మహత్యల నివారణ కమిటీ, ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ గత 20 ఏళ్లుగా తెలంగాణలో ఆత్మహత్యల నివారణకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇప్పటివరకు 28 మంది జీవితాలను కాపాడడం గొప్ప విషయమన్నారు. ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్, ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ ఆత్మహత్యకు ప్రయత్నించే వ్యక్తుల పట్ల సమాజం సానుభూతి, మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో ఆత్మహత్యల నివారణ కమిటీ సభ్యుడు రాంపెల్లి లింగమూర్తి, భారతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆడెపు రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.


