న్యూస్‌రీల్
వరంగల్ అర్బన్: క్షేత్రస్థాయిలో పర్యటన, సమీక్ష అనే రెండు కోణాల్లో పనితీరు ఉంటుంది.. బల్దియా అధికారులు, సిబ్బంది నుంచి మహానగర ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయా లేదా అని నిరంతరం పరిశీలిస్తా.. పారిశుద్ధ్యం, పచ్చదనంపై ప్రత్యేకంగా ఫోకస్ పెడతా.. బల్దియా కార్యాలయంలో పెండింగ్ ఫైళ్లు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ టి.వెంకన్న తెలిపారు. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించి నెల గడుస్తున్న సందర్భంగా ‘సాక్షి’తో ఆయన బుధవారం ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
శక్తివంచన లేకుండా పనిచేస్తా..
నేను ఉమ్మడి వరంగల్ జిల్లా వాసినే. నాకు వరంగల్ మహానగరంపై ప్రత్యేక అభిమానం, అవగాహన ఉంది. చారిత్రక, పర్యాటక నగరంలో పనిచేయడం మంచి అవకాశం. నగరంలో దీర్ఘకాలిక పనులను దశల వారీగా పూర్తిచేసి ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా చూస్తా. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతా.
పారిశుద్ధ్య వ్యవస్థను గాడిలో పెడతా..
క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనితీరును మెరుగుపర్చేందుకు రోజూ తెల్లవారుజామున తనిఖీలు చేస్తున్నా. సిబ్బంది, అధికారులను అప్రమత్తం చేస్తున్నా. ఇంటింటా తడి, పొడి చెత్త సేకరించి రీసైక్లింగ్ చేయిస్తున్నా. రోడ్లపై చెత్త పేరుకుపోకుండా కృషి చేస్తున్నా. కారులోనే కాదు.. అవసరమైతే ద్విచక్రవాహనంపై కూడా పర్యటిస్తా.
● చారిత్రక, పర్యాటక నగరంలో
పనిచేయడం మంచి అవకాశం
● ‘సాక్షి’తో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న
క్షేత్ర పర్యటన,
సమీక్షలతో
ప్రజా సమస్యలకు పరిష్కారం
15 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు
మహానగరంలో ఈ ఏడాది 15లక్షలకు పైచిలుకు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. విద్యుత్ తీగల కింద కాకుండా రోడ్లకు రెండు వైపులా సంరక్షణగా ఉండేవిధంగా, కెనాల్, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటి పెంచేందుకు కృషిచేస్తాం. నగరంలో పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తా.


