సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత
హన్మకొండ అర్బన్: దురాశ, అవగాహన లేమిని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని, అప్రమత్తతతో వ్యవహరిస్తేనే ఇలాంటి నేరాలను నివారించవచ్చని సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత అన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లో సిబ్బందికి బుధవారం నిర్వహించిన సైబర్ భద్రత అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు, పెట్టుబడులపై అధిక లాభాల పేరుతో అమాయకులను సైబర్ నేరగాళ్లు వలలో వేస్తున్నారని తెలిపారు. ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డు సమాచారం, వ్యక్తిగత వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. అపరిచితులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలను నమ్మి పెట్టుబడి పెట్టరాదన్నారు. అనంతరం ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎన్.రవి మాట్లాడుతూ ఉన్నత విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం సైబర్ మోసాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించడం ద్వారా మోసాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది సైబర్ నేరాల నివారణపై ప్రతిజ్ఞ చేశారు.


