కాశిబుగ్గ: వరంగల్‌లోని సీకేఎం ప్రసూతి ఆస్పత్రిని వరంగల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ యూనిట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విభాగానికి మెడికల్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. అలాగే, ఆస్పత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచేందుకు వారంలో ఒకసారి శానిటేషన్ సిబ్బందిని ఇక్కడికి పంపిస్తామని చెప్పారు. ముఖ్యంగా ఆస్పత్రి ఎదుట పంపిణీ చేస్తున్న రూ.5 భోజనం వల్ల అపరిశుభ్రత నెలకొంటున్న క్రమంలో ఆస్పత్రి వెనుకభాగంలోని ఖాళీ స్థలాన్ని శుభ్రం చేయించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి, పలువురు ఆర్‌ఎంఓలు, ఆస్పత్రి సిబ్బంది, తదితరులు ఉన్నారు.
అర్బన్ హెల్త్ సెంటర్లలో తనిఖీలు
వరంగల్‌లోని దేశాయిపేట, చింతల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దేశాయిపేటలో ఇమ్యూనైజేషన్ సెషన్‌ను పర్యవేక్షించి, టీకాల నిర్వహణ, లబ్ధిదారుల నమోదు, రికార్డులు పరిశీలించారు. చింతల్‌లో రికార్డులను పరిశీలించి, డెంగీ, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై సమీక్షించారు. అలాగే, డాక్టర్స్ కాలనీ –2లో డెంగీ నివారణ ప్రత్యేక వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భరత్‌కుమార్, డాక్టర్ దిలీప్‌కుమార్, సబ్ యూనిట్ ఆఫీసర్ కె.కుమారస్వామి, హెచ్‌ఈఓ సదానందం, మధుకర్, కోర్నేలు పాల్గొన్నారు.


