కొత్త పరిరక్షణ కమిటీతో ఆక్రమణల చెరవీడేనా?
● చెరువుల ఆక్రమణలపై సర్కారు సీరియస్
● సంరక్షణ, పునరుద్ధరణపై ప్రభుత్వం దృష్టి
● కబ్జా కోరల్లో ‘గ్రేటర్’ పరిధి గొలుసుకట్టు చెరువులు
● సర్వేల్లో వెల్లడైన వాస్తవాలు
● చర్యలు లేక ‘మామూలు’గా మారిన కబ్జాలు
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ నగరంలో ఆక్రమణదారులు చెరువుల్ని మింగేస్తున్నారు. కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులు కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు తాగునీటి అవసరాలు తీర్చిన వాటిలో కొన్ని ఇప్పటికే ఆక్రమణలపాలై కనుమరుగయ్యాయి. మరికొన్ని మురుగునీటి కాసారాలుగా మారుతున్నాయి. గట్లు, కాలువలే కాదు.. శిఖం భూములు కూడా ప్లాట్లుగా మారిపోయాయి. చెరువు భూములను ఆసరాగా చేసుకుని వందల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోంది. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీస్‌లో రోజురోజుకూ విస్తరిస్తుండడంతో అధిక సంఖ్యలో చెరువులు ఆక్రమణలతో కుచించుకుపోయాయి. ఏడాది క్రితం నీటి పారుదల శాఖ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, రెవెన్యూ, పురపాలక అధికారులు పరిశీలించగా.. అనేక చెరువులు కనుమరుగైనట్లు, మరికొన్ని ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించారు కూడా. సర్వే చేసినప్పటికీ, కబ్జాకు గురైందని తేలినప్పటికీ ఇప్పటికీ ఎవరిపై చర్యలు తీసుకోకపోవడంతో ఆక్రమణలు ‘మామూలు’గా మారుతున్నాయి. కాగా, ‘కుడా’ వైస్ చైర్మన్ మెంబర్ సెక్రెట్రీగా, పోలీస్ కమిషనర్, వరంగల్, హనుమకొండ, జనగామ కలెక్టర్లు, జీడబ్ల్యూఎంసీ కమిషనర్, ఫారెస్ట్, ఇరిగేషన్, పీసీబీ అధికారులు సభ్యులుగా ప్రభుత్వం బుధవారం లేక్ ప్రొటెక్షన్ కమిటీ వేసింది. ఈనేపథ్యంలో చెరువుల ఆక్రమణలపై చర్యలు, చెరువుల సంరక్షణ, పునరుద్ధరణకు అడుగుపడుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.


