వరంగల్ జిల్లాలో 509 షాపులు
హన్మకొండ అర్బన్: వర్షాకాలం నేపథ్యంలో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఆగస్టులో పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, జిల్లాలో ఇప్పటికీ అనేక రేషన్ దుకాణాలకు బియ్యం చేరలేదు. బియ్యం రవాణా, తూకం ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించకపోవడంతో ప్రతి నెలా భారీ మొత్తంలో బియ్యం దారి మళ్లుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో మొత్తం 414 రేషన్ దుకాణాలు, 2,57,815 రేషన్ కార్డులు, 7,76,498 మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి నెలా 48,74,027 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా.. ఈసారి ఆగస్టులో 3 నెలల కోటాగా 1,46,22,081 కిలోల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది.
జిల్లాలో రవాణా ఇలా..
హనుమకొండ జిల్లాలో రేషన్ బియ్యం సరఫరా రెండు మండల స్థాయి నిల్వ కేంద్రాల ద్వారా జరుగుతోంది. ఒకటి హనుమకొండ, మరొకటి పరకాల కేంద్రంగా పనిచేస్తున్నాయి. హనుమకొండ నిల్వ కేంద్రం పరిధిలో 265 రేషన్ దుకాణాలు ఎనిమిది మండలాల్లో ఉండగా.. పరకాల నిల్వ కేంద్రం పరిధిలో 149 రేషన్ దుకాణాలు ఆరు మండలాల్లో ఉన్నాయి. రాష్ట్ర గిడ్డంగులు, భారత ఆహార సంస్థ గిడ్డంగులనుంచి బియ్యాన్ని మండల స్థాయి నిల్వ కేంద్రాలకు తరలించే బాధ్యత మొదటి దశ కాంట్రాక్టర్‌ది. అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేసే బాధ్యత రెండో దశ కాంట్రాక్టర్‌ది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతీ నెల 15వ తేదీ తర్వాత రవాణా ప్రారంభమై నెలాఖరులోగా పూర్తవ్వాలి. అప్పుడే తదుపరి నెల 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు పంపిణీ సజావుగా సాగుతుంది.
ప్రభుత్వం చెల్లిస్తున్నా.. అదనపు డిమాండ్?
మొదటి దశ కాంట్రాక్టర్‌కు గిడ్డంగుల నుంచి నిల్వ కేంద్రాలకు బియ్యం తరలించినందుకు ప్రభుత్వం ప్రతీ టన్నుకు సుమారు రూ.250 రవాణా చార్జీ చెల్లిస్తోంది. నిల్వ కేంద్రాల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం తరలించే రెండో దశ కాంట్రాక్టర్‌కు ప్రతి క్వింటాకు రూ.27 చొప్పున రవాణా చార్జీలు చెల్లిస్తోంది. అదేవిధంగా నిల్వ కేంద్రాల్లో బియ్యం బస్తాలను దించడం, తూకం వేయడం, మళ్లీ వాహనాల్లో ఎక్కించడం వంటి పనులకు ప్రతీ బస్తాకు రూ.14 చొప్పున హమాలీలకు ప్రభుత్వం చెల్లిస్తోంది. రేషన్ దుకాణాల వద్ద అవసరమైతే బస్తాలు దించేందుకు ప్రతి బస్తాకు రూ.5 చొప్పున కూడా చెల్లించే నిబంధన ఉంది. ప్రభుత్వం ఇప్పటికే నిర్ణీత చార్జీలు చెల్లిస్తున్నప్పటికీ, బస్తాలకు తూకం వేయాలంటే అదనపు చార్జీలు ఇవ్వాలని హమాలీలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
ఒక్కో బస్తాలో రెండు కిలోల తరుగు!
నిబంధనల ప్రకారం మండల స్థాయి నిల్వ కేంద్రాల్లో ప్రతఅఈ 50 కిలోల బియ్యం బస్తాను తూకం వేసిన అనంతరం రెండో దశ వాహనాల్లో ఎక్కించి రేషన్ దుకాణాలకు పంపాలి. కానీ.. ఆ ప్రక్రియను పాటించకుండా మొదటి దశ వాహనాల నుంచి నేరుగా రెండో దశ వాహనాల్లోకి బస్తాలను మార్చి పంపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ఒక్కో బస్తాలో రెండు కిలోల వరకు బియ్యం తక్కువగా ఉంటోందని, ఈ నష్టం చివరకు డీలర్లపై పడుతోందని వారు చెబుతున్నారు. మొదటి, రెండో దశ రవాణా పనులు వేర్వేరు కాంట్రాక్టర్ల ద్వారా నిర్వహించాల్సి ఉండగా, ప్రస్తుతం ఒకే వ్యక్తి ఆధిపత్యం కొనసాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.
సజావుగా సాగుతుందా?
మరో రెండు రోజుల్లో జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాలకు మూడు నెలల కోటా బియ్యం చేరాల్సి ఉంది. ప్రస్తుతం సరఫరా మందగించడం వల్ల ఆగస్టు 1 నుంచి పంపిణీ సజావుగా సాగుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద నిబంధనల ప్రకారం ప్రతీ బస్తాకు తూకం వేసి, పారదర్శకంగా రేషన్ దుకాణాలకు సరఫరా చేయాలని, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రేషన్ డీలర్లు, లబ్ధిదారులు కోరుతున్నారు.
రేషన్‌బియ్యం రవాణాపై అనుమానాలు
హమాలీల అదనపు చార్జీల డిమాండ్‌పై ఆరోపణలు
ఇంకా దుకాణాలకు చేరని నిల్వలు
రేపటినుంచి పంపిణీ సజావుగా సాగేనా?
గోదాం నుంచి లారీల్లో షాపులకు తరలిస్తున్న బియ్యం
ఖిలావరంగల్: వరంగల్ జిల్లాలోని 13 మండలాల్లో 509 షాపులు ఉన్నాయి. వరంగల్ ఏనుమాముల, నర్సంపేట, వర్ధన్నపేట ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు బియ్యం సరఫరా అవుతాయి. మొత్తం 2,93,824 రేషన్‌కార్డులు ఉండగా.. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున మూడు నెలలకు 18 కి లోల లెక్కన మొత్తం 158,433,74 మెట్రిక్ ట న్నుల సన్నబియ్యం పంపిణీ చేయాల్సి ఉంది.


