వరుస హత్యలతో కలకలం
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస హత్యలు బెంబేలెత్తిస్తున్నాయి. రోజుకు ఎక్కడో ఒక చోట నేరం జరుగుతోంది. రౌడీలు యథేచ్ఛగా తిరుగుతున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇటీవలి ఘటనలు చెబుతున్నాయి. జీవిత ఖైదు పడిన రౌడీ షీటర్ బెయిల్‌పై వచ్చి మరో హత్యను చేసి తప్పించుకొని పోలీసులకు సవాల్‌గా మారాడు. ఎట్టకేలకు ఆదివారం పోలీసులు నిందితులను అరెస్టు చూపారు.
– వరంగల్ క్రైం/ఖిలా వరంగల్
● పట్టుతప్పుతున్న పోలీసింగ్.. భయాందోళనలో నగరం
● కమిషనరేట్ పరిధిలో బెంబేలెత్తిస్తున్న చైన్‌స్నాచింగ్‌లు
● పోలీసులకు సవాల్ విసురుతున్న నేరగాళ్లు
● సీపీ మరింత దృష్టి పెట్టాలని ప్రజల విన్నపం
దృష్టిసారించని టాస్క్‌ఫోర్స్!
చైన్‌స్నాచింగ్‌లు జరిగే ముందు దొంగలు.. పార్కింగ్ చేసి ఉన్న బైక్‌లు ఎత్తుకెళ్లి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. బ్లూకోల్ట్ సిబ్బంది షిఫ్టుల వారీగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నప్పటికీ చోరీలు ఆగట్లేదన్న చర్చ జరుగుతోంది. అప్పుడప్పుడు గుట్కాలు, అడపాదడపా పీడీఎస్ బియ్యం, పలుమార్లు ఫోన్లు చేసి సమాచారం ఇస్తే.. పేకాట స్థావరాలపై దాడులు తప్ప టాస్క్‌ఫోర్స్ అధికారులు వేటిపైనా దృష్టి సారించట్లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల హనుమకొండకు చెందిన ఓ రౌడీషీటర్ పుట్టిన రోజు వేడుకలు ఘన్‌పూర్‌లోని ఓ రిసార్ట్‌లో ఘనంగా జరుపుకుంటే ట్రైసిటీలో రౌడీలంతా హాజరై సంబురాల్లో మునిగి తేలడం వివాదాస్పదమైంది. గతంలో రౌడీషీటర్లకు తరచూ కౌన్సెలింగ్ ఇచ్చేవారు. ప్రస్తుతం రౌడీషీటర్లు ఎలాంటి ఘటనల్లో తలదూర్చినా అధికారులు మాకెందుకులే అని ఊరుకుంటున్నారనన్న ఆరోపణలున్నాయి.
పోలీస్ సైరన్‌కు ఏమైంది?
కమిషనరేట్ పరిధిలో పోలీసులకు వాహనాలిచ్చి ఇప్పటికే పదేళ్లు దాటింది. అన్ని స్టేషన్లలో వాటి పరిస్థితి అధ్వానం. వాహనాలకు అవసరమైన టైర్లు, బ్యాటరీలు, మెయింటెనెన్స్ లేక వాహనాలు పార్కింగ్ ప్లేస్ దాటి బయటకు రావట్లేదు. వీటి భారం, నెలవారీ మెయింటెనెన్స్ రెగ్యులర్‌గా రాక ఎస్‌హెచ్‌ఓలపై భారం పడుతుండడంతో వాళ్లు కూడా చేతులు ఎత్తుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పెట్రోలింగ్ జరగడం లేదని తెలుస్తోంది. నగరంలో చాలా పోలీస్ స్టేషన్ల పరిధిలో మచ్చుకు ఒకటి రెండు వాహనాలు తిప్పి చేతులు దులుపుకుంటున్నారని ఆయా కాలనీలవాసులు విమర్శిస్తున్నారు. దీంతో పోలీస్ సైరన్ మూగబోయిందా అంటూ నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.
ఏసీపీ లేక నేర నియంత్రణపై ప్రభావం!
వరంగల్ నగరంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) పోస్ట్ చాలాకాలంగా ఖాళీగా ఉంది. దీంతో పోలీస్ పరిపాలనపై ప్రభావం పడుతోంది. ఇంతకాలం ఏఎస్పీ శుభం ప్రకాశ్ బాధ్యతల్లో ఉన్నంత కాలం నేరాలు తగ్గుముఖం పట్టాయి. ఆయన బదిలీ కావడంతో ఏసీపీ స్థాయి అధికారి లేక ఇన్‌చార్జ్ ఏసీపీ ఉన్నప్పటికీ కీలక నిర్ణయాలు ఆలస్యం కావడం, నేరాల పర్యవేక్షణలో లోపాలు ఏర్పడడం, ప్రజలకు అందాల్సిన సేవల్లో జాప్యం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీపీ దృష్టి సారించాలి..
కమిషనరేట్ పరిధిలో భూముల రేట్లు పెరగడం, డబుల్ డాక్యుమెంట్లు సృష్టించడం, మాట వినని వారిని బెదిరించడం, అడిగే వారు లేకుంటే కబ్జా చేయడం వంటి పనులతో కమిషనరేట్‌లో రౌడీలకు చేతినిండా పని దొరికినట్లయ్యింది. రౌడీలకు నేతలతో పాటు కొంత మంది పోలీస్ అధికారుల అండదండలు ఉండడంతో వారు రెచ్చిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీపీ శ్వేత సూచనల మేరకు కమిషనరేట్ పరిధిలో పోలీసులు మెరుగ్గా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ మరింత ప్రజలకు చేరువవ్వాల్సిన అవసరం ఉంది. పెట్రోలింగ్, ప్రజల భద్రత, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ విభాగాల్లో ఏళ్లుగా పాతుకుపోయిన వారి విధులపై సీపీ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నగరంలో నేరాల నియంత్రణ కోసం పోలీసుల గస్తీని మరింత పెంచాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణను విస్తరించాలని, రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సీపీ శ్వేతను ప్రజలు కోరుతున్నారు.


