హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శాకంబరీ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అమ్మవారికి బలాకా, విజయా క్రమాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు నిత్యాహ్నికపూజలు చతుస్థానార్చనలు నిర్వహించారు. స్నపనమూర్తిని కాళీకల్పకం ప్రకారం బలాకా అమ్మవారుగా, బోగభేరాన్ని షోడశీక్రమంలో విజయా నిత్యగా అలంకరించారు. చతుఃస్థానార్చన పూజలు, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. ఆలయ ఈఓ రామల సునీత పర్యవేక్షించారు.
వరంగల్ అర్బన్: జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ ఇసంపల్లి జోనా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి కౌన్సిల్‌హాల్‌లో రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కేయూ క్యాంపస్: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థుల కోసం ఉచిత సివిల్ సర్వీసెస్‌లో శిక్షణ కోసం నిర్వహించిన ప్రవేశ అర్హత పరీక్ష ఆదివారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రశాంతంగా ము గిసింది. ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి నిర్మల, హైదరాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ జగన్‌మోహన్, ఆస్టడీ సర్కిల్ ప్రతినిధి కిరణ్ పర్యవేక్షించారు.
హన్మకొండ: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడానికి ఈ నెల 27 నుంచి 29 వరకు రైతువేదికల్లో విత్తనమేళా నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా వ్యవసాయాధికారి విజయ్‌చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో సాగుకు అనువైన పంటల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. కందులు, పెసలు, మినుములు, కూరగాయల విత్తనాలు, పచ్చిరొట్ట, జొన్నవిత్తనాలు విక్రయించనున్నట్లు తెలిపారు. హనుమకొండ, కమలాపూర్, వేలేరు, కాజీపేట, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, హసన్‌పర్తి, ఐనవోలు, ధర్మసాగర్, పరకాల, దామెర, నడికూడ, ఆత్మకూరు, శాయంపేట రైతు వేదికల్లో రైతుమేళాలు నిర్వహించనున్నట్లు వివరించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వరికి బదులు, కంది, పెసలు, మినుములు, నువ్వులు, మొక్కజొన్న, జొన్న, పెసర వంటి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు.
కాజీపేట అర్బన్: గ్రేటర్ వరంగల్ 31వ డివిజన్ పరిధి న్యూశాయంపేట రైల్వే గేట్‌ను సోమవారం నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఆరు రోజులు మూసివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాక్ మరమ్మతుల్లో భాగంగా రైల్వే గేట్‌ను మూసివేస్తుండగా న్యూశాయంపేట నుంచి భట్టుపల్లి గ్రామానికి రాకపోకలు కొనసాగించాలని, ప్రజలు సహకరించాలని మాజీ కార్పొరేటర్ మామిండ్ల రాజు కోరారు.
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రెండు నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈనెల 27న బేస్‌లైన్ పరీక్షలు నిర్వహించాలని డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్, జిల్లాక్వాలిటీ కోఆర్డినేటర్ డాక్టర్ బండారు మన్‌మోహన్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ యాప్ ద్వారా టెస్ట్ నిర్వహించాలని పేర్కొన్నారు. పరీక్షలు నిర్వహించిన వెంటనే టీఎస్ ఎడ్యుకేషన్ యాప్‌లో విద్యార్థుల వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు తమ పరిధిలోని అన్ని పాఠశాలల్లో పరీక్షలు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.


