రెడ్‌క్రాస్‌ సొసైటీకి విరాళం | - | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌ సొసైటీకి విరాళం

Jul 10 2026 9:45 AM | Updated on Jul 10 2026 9:45 AM

రెడ్‌క్రాస్‌ సొసైటీకి విరాళం నేటి పరీక్షలు వాయిదా సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో స్క్రాప్‌ విక్రయం 862 కిలోల గంజాయి దహనం పెరకవాడలో చైన్‌స్నాచింగ్‌

హన్మకొండ అర్బన్‌: హనుమకొండ జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీకి తన ట్రస్ట్‌ తరఫున ‘కుడా’ చైర్మన్‌ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి రూ.1,00,116 విరాళం అందించారు. ఈమేరకు విరాళం చెక్కును గురువారం రెడ్‌ క్రాస్‌ పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాకు అందజేశారు. సమాజ సేవలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని ట్రస్ట్‌ ప్రతినిధులు తెలిపారు. అత్యవసర సమయాల్లో రక్తదానం చేస్తూ ప్రాణాలు కాపాడుతున్న రెడ్‌క్రాస్‌ సొసైటీకి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, జిల్లా ఉన్నతాధికారులు, ట్రస్ట్‌ ప్రతినిధులు, రెడ్‌ క్రాస్‌ బాధ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

కేయూ క్యాంపస్‌: కేయూ పరిధిలో ఈనెల 10న జరగాల్సిన బీటెక్‌, ఫార్మసీ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్‌ గురువారం తెలిపారు. బీటెక్‌ ఆరో సెమిస్టర్‌, ఫార్మ్‌డీ మూడో సెమిస్టర్‌ బీఫార్మసీ రెండో సెమిస్టర్‌, ఆరో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 10న జరగాల్సి ఉండగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఆయా పరీక్షలను రీషెడ్యూల్‌ కూడా చేసినట్లు తెలిపారు. ఈనెల 10న జరగాల్సిన బీటెక్‌ ఆరో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 25న, ఫార్మ్‌డీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 23న, బీఫార్మసీ రెండో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 18న, బీఫార్మసీ ఆరో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 23న నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

కాశిబుగ్గ: వరంగల్‌ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో చాలా కాలం నుంచి పేరుకుపోయిన స్క్రాప్‌ను ఎట్టకేలకు తొలగించారు. గత నెలలో ‘పేరుకుపోయిన స్క్రాప్‌’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఇనుప స్క్రాప్‌ను విక్రయించడానికి నిర్ణయించారు. ఈనేపథ్యంలో దీని కోసం టెండర్‌ పిలిచి, అధికంగా కోట్‌ చేసిన వారికి విక్రయించారు. దీనికి రూ.2,95,000 టెండర్‌ పాడినట్లు తెలుస్తోంది.

కొనసాగిన టీజీసీపీజీఈటీ

కేయూ క్యాంపస్‌ : రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో 2026–2027 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకుగాను నిర్వహిస్తున్న టీజీసీపీజీఈటీ రెండో రోజు గురువారం 22 కేంద్రాల్లో ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని సీపీజీఈటీ కన్వీనర్‌, కేయూ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ప్రొఫెసర్‌ రాజేందర్‌ తెలిపారు. రెండోరోజు మొదటి సెషన్‌లో ఎంఏ ఎకనామిక్స్‌ కోర్సుకు 1,143 మంది, ఎంఏ తెలుగుకోర్సుకు 2,486మంది అభ్యర్థులు హాజరయ్యారు. సాయంత్రం సెషన్‌లో ఎమ్మెస్సీ సైకాలజీ, ఎమ్మెసీ డేటాసైన్స్‌ ప్రవేశ పరీక్షలకు 1,233 మందికి 1048 మంది అభ్యర్థులు హాజరయ్యారని కన్వీనర్‌ రాజేందర్‌ తెలిపారు.

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 86 కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న సుమారు రూ.4.31 కోట్ల విలువైన 862 కిలోల గంజాయిని హనుమకొండ జిల్లా అమ్మవారిపేటలోని కాకతీయ మెడిక్లీన్‌ సర్వీసెస్‌ వద్ద (ఇన్సినరేషన్‌ పద్ధతిలో) దహనం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు, డ్రగ్‌ డిస్పోజల్‌ కమిటీ ఆధ్వర్యంలో గంజాయిని దహనం చేసినట్లు ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌ తెలిపారు. ఇందులో అదనపు డీసీపీ ప్రభాకర్‌ రావు, సీసీఆర్‌బీ ఏసీపీ పి.డేవిడ్‌ రాజు, ఇన్‌స్పెక్టర్‌ సంజీవరావు, ఎస్సై నరేశ్‌, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఖిలా వరంగల్‌: వరంగల్‌ రైల్వేగేట్‌ పెరకవాడలో గురువారం చైన్‌స్నాచింగ్‌ జరిగింది. మినుముల వరలక్ష్మి గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కిరాణా దుకాణానికి నడుస్తూ వెళ్తుండగా.. గుర్తుతెలియని ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పరారయ్యాడు. మిల్స్‌కాలనీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలు వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ కర్రె స్వామి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement