బయ్యారం: బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఉద్యమిస్తామని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం బయ్యారం సమీపంలోని ఇనుపరాతిగుట్టను సందర్శించారు. అనంతరం మండలంలోని చర్లపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బయ్యారం గనులను ప్రభుత్వరంగ సంస్థ సింగరేణికి అప్పగించాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని నినదించి ఆంధ్రపాలకుల నుంచి తెలంగాణ సంపదను కాపాడామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఇనుపరాయి గనులున్నాయని, వీటి ఆధారంగా బయ్యారంలో సింగరేణి సంస్థతో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఒకటి రెండుసార్లు విభజన చట్టంలో పొందుపర్చిన బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేయలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడిచినా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మిస్తే ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. సింగరేణిలో 35 వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఈ నెల 20 నుంచి అన్నం, నీరు ముట్టకుండా దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ. లక్షతోపాటు తులం బంగారం, పింఛన్ల పెంపు తదితర మాయమాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో పేదపిల్లలతోపాటు ఆడపిల్లలు చదువుకు దూరం కావాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా తాను తెలంగాణ సేనను ఏర్పాటు చేశానన్నారు. ఆడబిడ్డలకు రాజకీయంగా హక్కు ఉండాలని, ఆదివాసీల అభివృద్ధికి తమ పార్టీ ప్రత్యేకంగా రెండు గిరిజన విభాగాలను ఏర్పాటు చేసిందన్నారు. పార్టీ నాయకులు బోడ జనార్దన్, రామకృష్ణదొర, రియాజ్ అహ్మద్, నవీన్ ఆచారి, వీరన్న ఉన్నారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు
ఉక్కు పరిశ్రమపై చిన్నచూపు
టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత


