పథకాలు అర్హులకు చేరాలి | - | Sakshi
Sakshi News home page

పథకాలు అర్హులకు చేరాలి

Jul 10 2026 9:45 AM | Updated on Jul 10 2026 9:45 AM

పథకాలు అర్హులకు చేరాలి

హన్మకొండ అర్బన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రయోజనాలు చివరి లబ్ధిదారుడి వరకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా సూచించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో హనుమకొండ, వరంగల్‌ జిల్లాల అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. టీబీ నిర్మూలన, పల్స్‌పోలియో, ఇందిరమ్మ ఇళ్లు, వైద్య సేవలు, వ్యవసాయం, మౌలిక వసతుల కల్పనపై అధి కారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాలనలో నాణ్యత, పారదర్శకత, సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలని, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలను బలోపేతం చేయాలన్నారు. రైతులను విలువ ఆధారిత పంటల సాగు వైపు ప్రోత్సహించాలని సూచించారు.

హాస్టళ్ల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ:

మంత్రి అడ్లూరి

వర్షాకాలంలో సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. అత్యవసర మరమ్మతుల కోసం ప్రతీ జిల్లాకు రూ.కోటి వరకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామన్నారు. ఆరోగ్య పరీక్షలు, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌, ఎమ్మెల్యేలు, హనుమకొండ, వరంగల్‌ కలెక్టర్లు చాహత్‌ బాజ్‌పాయ్‌, డాక్టర్‌ సత్యశారద, పోలీస్‌ కమిషనర్‌ శ్వేత, అదనపు కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

భద్రకాళి అమ్మవారికి పూజలు

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి అమ్మవారిని గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ఆయన సతీమణి జానకి శుక్లా దర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించుకున్నారు. ముందుగా వారు గోవులకు గ్రాసం అందించి ఆదిశంకరులను, వల్లభగణపతిని దర్శించుకున్నారు. దీపారాధన చేశారు. అమ్మవారిని దర్శించి కుంకుమార్చన, పూజలు నిర్వహించుకున్నారు.

గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా

అధికారులతో సమీక్ష

మహిళల కృషికి ప్రశంస

హన్మకొండ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా గురువారం సందర్శించి మహిళల కృషిని అభినందించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, వ్యవసాయ, ఉద్యాన శాఖల స్టాళ్లలో ప్రదర్శించిన ఉత్పత్తులను పరిశీలించి తయారీ విధానం, నాణ్యత, మార్కెటింగ్‌ అవకాశాలపై మహిళలతో మాట్లాడారు. వరంగల్‌ దరీ స్టాల్‌ను సందర్శించి దరీల ప్రత్యేకత, మార్కెట్‌ అవకాశాలపై వివరాలు తెలుసుకుని వాటిని కొన్నారు. అనంతరం మహిళలను ప్రోత్సహిస్తూ పలు స్టాళ్లలోని ఉత్పత్తులను కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement