న్యూశాయంపేట: ప్రభుత్వం సవరించిన బీసీల్లోని కొన్ని కులాల పేర్లను గమనించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రూప్–ఏ కేటగిరి సీరియల్ నంబర్–7లో ఉన్న డొమ్మర పేరును తొలగించి గడవంశీయ, సీరియల్ నంబర్ 18లో ఉన్న పిచ్చిగుంట్లను తొలగించి వంశరాజ్‌గా సవరించినట్లు ఆమె తెలిపారు. సీరియల్ నంబర్–4లో ఉన్న బుడబుక్కలకు శివక్షత్రియ, 23లో ఉన్న వీరభద్రీయ (వీరముష్టి లేదా నెట్టికోటల)గా సవరించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత అభ్యర్థుల అభ్యర్థన మేరకు వీరభద్రీయ, వీరముష్టి లేదా నెట్టికోటల పేర్లతో కుల ధ్రువీకరణ పత్రాలు జారీచేయనున్నట్లు వవరించారు. ఈ మార్పు కులం పేరుకు మాత్రమేనని, సంబంధిత కులాల రిజర్వేషన్ వర్గీకరణ హక్కులు, ప్రయోజనాల్లో ఎలాంటి మార్పు లేదని ఆమె స్పష్టం చేశారు.
కాజీపేట అర్బన్ : కాజీపేట మండలం మడికొండలోని సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల, కళాశాల విద్యార్థినులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గురువారం నాణ్యమైన బియ్యాన్ని సంబంధిత అధికారులకు తెలిపి పంపించారు. ఇటీవల ఆయన సదరు సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో అన్నంలో పురుగులు వస్తున్నాయని పలువురు విద్యార్థినులు వాపోయారు. దీంతో స్పందించిన ఆయన పాత బియ్యాన్ని మార్చి నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని ఆదేశించారు. అధికారులు గురువారం బియ్యం అందజేయడంతో విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు.


