వరంగల్ అర్బన్: చాలీచాలని జీతాలు. ఆ డబ్బులు కూడా సకాలంలో అందక కార్మికులు ఆర్థిక అవస్థలు పడుతున్నారు. వరంగల్ మహా నగర పాలక సంస్థలోని ఔట్ సోర్సింగ్ పద్ధతిపై పనిచేస్తున్న పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, వాహనాల డ్రైవర్లు, అర్బన్ మలేరియా విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల అవస్థలు వర్ణనాతీతం. వరంగల్ నగర పాలక సంస్థలోని ప్రజారోగ్య విభాగం, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, టౌన్ ప్లానింగ్, అర్బన్ మలేరియా, ట్యాక్స్, జనరల్ విభాగంలో 3,200 మంది కార్మికులు ఔట్‌సోర్సింగ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ప్రతీ నెల రూ.6.40 కోట్ల సొమ్మును వేతన రూపంలో అందజేస్తుంటారు. ప్రతీ నెల 25వ తేదీలోగా అటెండెన్స్ పరిగణనలో తీసుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నెల 1వ తేదీన వేతనాలు అందించాలి. కానీ, 10 రోజులు గడిచినా వేతనాలు అందలేదు. సొమ్ముకు సంబంధించిన చెక్కును సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రాలేదని బల్దియా అకౌంటింగ్ విభాగం అధికారులు చెబుతున్నారు. కమిషనర్ ఆదేశాలతో ఒకటి, రెండు రోజుల్లో వేతనాలు కార్మికుల ఖాతాల్లో జమవువుతాయని, కమిషనర్ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నట్లు చెబుతున్నారు. కానీ, కార్మికులు మాత్రం ఆరు నెలల నుంచి సకాలంలో జీతాలు రావట్లేదని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
10 రోజులు కావొస్తున్నా అందని వేతనాలు
ఔట్‌సోర్సింగ్ కార్మికుల వెతలు


