ఆదిముక్తీశ్వరా.. నీకు ప్రణామాలు | - | Sakshi
Sakshi News home page

ఆదిముక్తీశ్వరా.. నీకు ప్రణామాలు

Jun 12 2026 7:19 AM | Updated on Jun 12 2026 7:19 AM

కాళేశ్వరం : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలోని కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానం పునరుద్ధరణ పనుల నేపథ్యంలో ఈనెల 17వ తేదీ నుంచి భక్తులు ఆదిముక్తీశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు. తద్వారా అడవిలో వెలసిన ఆదిముక్తీశ్వర ఆలయానికి ప్రత్యేక ప్రాధాన్యం లభించనుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ప్రధాన ఆలయానికి కిలోమీటర్‌ దూరంలో ఉంది. ఏడాదిపాటు ఆదిముక్తీశ్వరాలయానికి భక్తజనం క్యూ కట్టనున్నారు. దీంతో ఆలయం భక్తుల శివనామస్మరణతో మారుమోగనుంది.

షెడ్డుకు మరమ్మతులు..

రూ.198 కోట్ల వ్యయంతో శ్రీ కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థాన రాతి కట్టడాల పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవమూర్తులను (బాలాలయం) ఆదిముక్తీశ్వరాలయం సమీపంలోని ప్రత్యేక షెడ్డులో ప్రతిష్ఠించి నిత్య పూజలు కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ షెడ్డుకు గాలి, వెలుతురు పడకుండా సిమెంట్‌ మరమ్మతులు ప్రారంభించారు. క్యూలైన్లు ఏర్పాటు కానున్నాయి.

17న ఉదయం క్రతువు..

కర్ణాటకలోని శృంగేరి శారద పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి తీర్థ స్వామివారి అనుమతితో ఈ నెల 17న ఉదయం 8.15 గంటలకు వారి శిష్య బృందం ఆధ్వర్యంలో కళాపకర్షణ క్రతువు నిర్వహించి, ఆలయ తొలగింపు, పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈనెల 17 నుంచి భక్తుల దర్శనాలు, అభిషేకాలు, మొక్కులు, ప్రత్యేక పూజలు ఆదిముక్తీశ్వరాలయంలోనే నిర్వహించబడతాయి. టికెట్‌ విక్రయాలు, ప్రసాదాల పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు ఇతర వసతులపై దృష్టిసారిస్తున్నారు.

వసతుల ఏర్పాటు..

ఆదిముక్తీశ్వరాలయం వద్ద స్థలం పరిమితంగా ఉండడంతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. అలాగే, రవాణా, తాగునీరు, క్యూలైన్లు తదితర సౌకర్యాలను కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పునర్నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు సుమారు ఏడాది పాటు భక్తులు ఆదిముక్తీశ్వరాలయంలోనే స్వామివారిని దర్శించుకోనున్నారు. దీంతో ఆలయంలో సుమారు 60 మంది వరకు అర్చక సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటు దినసరి లేబర్‌ కూడా పనులు చేస్తున్నారు. దేవాదాయశాఖ మాత్రం ఎలాంటి ప్రకటనలు చేయకుండా గోప్యత పాటిస్తోంది.

ఈనెల 17వ తేదీ నుంచి అడవిలో

వెలసిన ఆలయంలో పూజలు

రూ.198 కోట్ల వ్యయంతో

కాళేశ్వరముక్తీశ్వరాలయంలో

రాతి నిర్మాణ పనులకు శ్రీకారం

ఏడాది పాటు కిలోమీటర్‌ దూరంలోని ఆదిముక్తీశ్వరాలయంలో మొక్కులు, అభిషేకాలు

Advertisement
 
Advertisement
Advertisement