ఖిలా వరంగల్: వాహనం అవసరాలను తీర్చేదిగా ఉండాలి.. కానీ, ప్రాణాల మీదకు తేవొద్దు అని రవాణా శాఖ అధికారులు అంటున్నారు. తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో తొంబై శాతం అతివేగం వల్ల జరుగుతున్నాయని అధికారుల పరిశీలనలో స్పష్టమవుతోంది. రోడ్డు భద్రత పాటించి వాహనాలు నడిపితే అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినా కొద్దిపాటి గాయాలతో బయటపడే అవకాశం ఉంటుందని అదే పరిమితికి మించి వేగంగా వెళ్తే మాత్రం ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
ద్విచక్ర వాహనదారులే అధికం
అత్యధికంగా ద్విచక్ర వాహనదారులే ప్రమాదాలకు గురవుతున్నారు. వరంగల్ ట్రైసిటీలో సుమారు 4 లక్షలకుపైగా వాహనాలు రహదారులపై తిరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాల వల్ల 28 శాతం ప్రమాదాలు జరుగుతుంటే లారీల వంటి పెద్ద వాహనాల వల్ల 20 శాతం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఆయా ప్రమాదాల్లో 31 శాతం మంది ద్విచక్ర వాహనదారులు మరణిస్తున్నారు.
ఇటీవలి కొన్ని ఘటనలు
● పున్నేలు కమాన్ సమీపాన విపరీతమైన వేగంతో వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ఇటీవల జఫర్‌ఘడ్ మండలం సాగరం గ్రామానికి చెందిన పిన్నింటి తరుణ్ మృతి చెందాడు.
● పున్నేలు క్రాస్ రోడ్డు వద్ద వెనుక నుంచి లారీ అతివేగంగా బైక్‌ను ఢీ కొట్టడంతో వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన గొల్లపల్లి అరుణ్(26) అక్కడికక్కడే మృతిచెందాడు.
ప్రమాదాలు నివారిస్తున్నాం..
వాహన అతివేగం వల్ల ప్రమాద తీవ్రత అధికంగా ఉంటుంది. గంటకు యాబై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వాహనాల్లో ప్రాణాపాయం తక్కువగా ఉంటుంది. వంద కిలోమీటర్లు దాటితే 99 శాతం ప్రాణహరణకు ఆస్కారం ఉంటుంది. మద్యం తాగి వాహనాలు నడపడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేయడం అంతే ప్రమాదకరం. సీట్ బెల్ట్ పెట్టుకోవడం, హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణ నష్టం తగ్గుతుంది. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు విశేషంగా కృషి చేస్తున్నాం.
– శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్, మామునూరు
రోడ్డు భద్రత పాటించని వాహనదారులు
కుటుంబాలకు తీరని శోకం


