13నుంచి రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు | - | Sakshi
Sakshi News home page

13నుంచి రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు

Apr 10 2026 9:33 AM | Updated on Apr 10 2026 9:33 AM

13నుంచి రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్‌ క్రైం : ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పోలీసుల ఆధ్వర్యంలో ‘ఆరైవ్‌ – ఆలైవ్‌’లో ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు వారాంతపు రోడ్డు భద్రతా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. గురువారం హైదరాబాద్‌నుంచి సీఎస్‌ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కమిషనరేట్‌ నుంచి సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ మాట్లాడారు. 13న మొదటి రోజు గ్రామస్థాయిలో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేసి, సభ్యులతో ప్రమాణం చేయిస్తామని తెలిపారు. రెండవ రోజు అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా విగ్రహాల వద్ద ట్రాఫిక్‌ నిబంధనలు పాటించేందుకు ప్రజలతో ప్రమాణం చేయించడంతోపాటు ప్రమాదాలకు గురయ్యే కూడళ్లను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మూడవ రోజు బాలల రోడ్డు భద్రత దినోత్సవంగా నిర్వహించి, విద్యార్థులకు రోడ్డు దాటే విధానం, హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ వినియోగంపై అవగాహన కల్పిస్తామన్నారు. నాల్గవ రోజు సోషల్‌ మీడియా ద్వారా అధికారులు, ప్రజలు రోడ్డు భద్రతపై చైతన్యం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడంతోపాటు. డ్రైవర్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, భద్రతా ప్రమాణాలు పరిశీలించనున్నట్లు తెలిపారు. ఐదవ రోజు గోల్డెన్‌ అవర్‌ స్పందనపై శిక్షణ నిర్వహించి, ప్రమాదాల సమయంలో ప్రాణాలను రక్షించే విధానాలపై అవగాహన కల్పిస్తామని వివరించారు. 18న ఆరవ రోజు జీరో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డేగా నిర్వహించి, ట్రాఫిక్‌ ఉల్లంఘనదారులకు జరిమానాలు విధించకుండా కౌన్సెలింగ్‌ ద్వారా అవగాహన కల్పిస్తామని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించి, ప్రమాదాలను తగ్గించడం ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజలు ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించి, సురక్షిత ప్రయాణానికి సహకరించాలని కోరారు. సమావేశంలో డీసీపీలు కవిత, అంకిత్‌ కుమార్‌, అదనపు డీసీపీ ప్రభాకర్‌రావు, ఏసీపీలు సత్యనారాయణ, జాన్‌ నర్సింహులు, ఇన్‌స్పెక్టర్లు సీతారెడ్డి, సుజాత, శ్రీనివాస్‌, రమేష్‌లు పాల్గొన్నారు.

13 నుంచి ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమం :

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమాన్ని వారం రోజులపాటు విస్తృతంగా నిర్వహించనున్నట్లు హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. గురువారం హైదరాబాద్‌నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌ రెడ్డి జిల్లాల కలెక్టర్లతో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో చేపడుతున్న కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. హనుమకొండనుంచి కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి మాట్లాడుతూ జిల్లాలో చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రవి, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement