కాజీపేట అర్బన్: ‘ఎవరూ చూడట్లేదు ఇష్టం వచ్చినట్లు మన పని మనం చేసుకోవచ్చు’ అన్నట్లుగా మారింది వరంగల్ ఆర్‌ఓ రిజిస్ట్రేషన్ కార్యాలయం తీరు. ఇందుకు నిదర్శనమే కళ్లు మూసుకున్న నిఘా నేత్రాలు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిత్యం భూక్రయవిక్రయదారులు దస్తావేజుల రిజిస్ట్రేషన్ నిమిత్తం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వస్తుంటారు. కాగా, రిజిస్ట్రేషన్ ప్రక్రియల్లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా ప్రతిదీ రికార్డు అయ్యేలా ప్రభుత్వం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వరంగల్ ఆర్‌ఓ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎక్కడా పని చేయట్లేదు. దీంతో సబ్ రిజిస్ట్రార్లు అక్రమాలకు తెర తీయడం, ఏసీబీ అధికారులు దాడులు చేయడం వరకు పరిస్థితి వెళ్లింది.
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇష్టారాజ్యం..
డాక్యుమెంట్ రైటర్లే వసూల్ రాజాలుగా మారి రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని శాసించే స్థాయికి ఎది గినా ఎక్కడా వీరి ఆగడాలను రికార్డు చేయలేకపోతున్నాయి సీసీ కెమెరాలు. పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు పని చేస్తే అక్రమాలకు చెక్ పడే అవకాశం ఉంటుదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
తీరు మారేనా?
ఏసీబీ దాడుల తర్వాత తాత్కాలిక పద్ధతిలో సబ్ రిజిస్ట్రార్లు విధులు నిర్వహిస్తుండగా.. పూరిస్థాయి సబ్ రిజిస్ట్రార్లను ఉన్నతాధికారులకు నియమించి అక్రమాలకు చెక్ పెట్టాలని భూక్రయవిక్రయదారులు, మధ్య తరగతి కుటుంబాలు ఆశిస్తున్నాయి. అక్రమాలకు నెలవుగా మారిన వరంగల్ ఆర్‌ఓ తీరుమారేనా? ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేనా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో
ఇష్టారాజ్యం
ఆర్‌ఓ తీరుమారేనా?


