● ఆదేశాలు జారీ చేసిన ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ
హన్మకొండ: ‘అమ్మకానికి ఉద్యోగం’ శీర్షికన ఈ నెల 10న సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించారు. ఔట్ సోర్సింగ్ నియామకాలపై విచారణ చేపట్టాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి.. కరీంనగర్ జోన్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ రవీందర్‌ను ఆదేశించారు. ఎండీ ఆదేశాలు అందుకున్న ఆయన విచారణ షురూ చేశారు.
పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు : డీసీపీ కవిత
వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలో పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సెంటర్ల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని సెంట్రల్ డీసీపీ దార కవిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిభద్రతల రక్షణలో భాగంగా సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ (144 సెక్షన్) అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడరాదని, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిషేధమని వివరించారు. ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు.
మార్కెట్ క్యాంటీన్‌లో పాము కలకలం
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లోని పల్లికాయ యార్డు పక్కనే ఉన్న క్యాంటీన్ నిర్వాహకుడిని పాము కాటేసింది. శుక్రవారం క్యాంటీన్ నిర్వాహకుడు శ్రీనివాస్ కట్టెలు తీసే క్రమంలో పామును పట్టుకోవడంతో కాటు వేసినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. అతడిని హోటల్ సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వంటకు ఉపయోగించే కట్టెలను పెద్ద మొత్తంలో పల్లికాయ యార్డు పక్కనే స్టాక్ పెట్టడంతో పాములు, విష పురుగులకు ఆవాసంగా మారిందని, వెంటనే కట్టెలను తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
శ్రీలంక క్రికెట్ టూర్‌కు పవన్, వైష్ణవ్
వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు కొలంబోలో జరగనున్న టీ–20, వన్‌డే మ్యాచ్‌లలో పాల్గొనేందుకు హెచ్‌సీఏ సంయుక్త జిల్లాల జట్టులో వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఎంపికై న క్రీడాకారుల్లో జి.పవన్, వి.వైష్ణవ్‌తో పాటు టూర్ పరిశీలకుడిగా చాగంటి శ్రీనివాస్, కోచ్‌లుగా జీఎస్ రాజు, సీహెచ్ వెంకటేశ్వర్లును హెచ్‌సీఏ అపెక్స్ కమిటీ ఎంపిక చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు.


