పొగ.. సెగ | - | Sakshi
Sakshi News home page

పొగ.. సెగ

Mar 14 2026 10:18 AM | Updated on Mar 14 2026 10:18 AM

మత్స్యకారుల విలవిల

మడికొండ సమీప గ్రామాల చెరువుల్లో చేపలు పెంచే మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారు. నీరు కలుషితం కారణంగా చేపలు ఎదగడం లేదని, చాలా వరకు చనిపోతున్నాయని, పెట్టుబడి సైతం రావట్లేదని వారంతా వాపోతున్నారు. సొంతంగా సీడ్స్‌ తెచ్చుకుని వేసుకుంటే కనీసం బతకడానికి కూడా కష్టమవుతోందని, డంపింగ్‌ యార్డు కారణంగా వృత్తిని వదిలి కూలీ పనులకు వెళ్లాల్సి వస్తోందని మత్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కల్లుతాళ్లు..

మడికొండ ప్రాంతంలో సుమారు 2,000కు పైన తాటిచెట్లు ఉంటాయి. వీటిని ఆధారంగా చేసుకుని సుమారు 200 కల్లుగీత కార్మిక కుటుంబాలు జీవిస్తున్నాయి. డంపింగ్‌ యార్డు పొగ, కలుషిత జలాల కారణంగా కల్లు రుచిపోతోందని, తమ గిరాకీ తగ్గుతోందని గీతకార్మికులు వాపోతున్నారు. ఇదివరకు మాదిరిగా కల్లు పారడం లేదని ఈ వృత్తిని నమ్ముకున్న తమకు భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిందని వారంతా ఆందోళన చెందుతున్నారు.

కాజీపేట అర్బన్‌: ‘పొగ తాగరాదు’ అని సినిమా థియేటర్లలో పలు బహిరంగ ప్రదేశాల్లో బోర్డులు చూస్తుంటాం. పొగ తాగే వారితో పాటు పీల్చినా ఆరోగ్యానికి ప్రమాదమే అని హెచ్చరిస్తుంటారు వైద్యులు. అలాంటిది నిత్యం చిన్నాపెద్దా తేడా లే కుండా పొగ పీలుస్తూనే ఉన్నారు మడికొండ, రాంపూర్‌, కాజీపేట, డీజిల్‌ కాలనీ, అయోధ్యపురం, కడిపికొండ, ధర్మసాగర్‌, కుమ్మరిగూడెం, తదితర గ్రామాల ప్రజలు. ఆయా ఊళ్ల ప్రజల జీవన విధానంలో పొగ అంతర్భాగమైంది. అనారోగ్యం రోజుకింత చొప్పున శరీరం లోపలికి వ్యాపిస్తోంది. పొసగకుండా చేస్తున్న ఈ పొగ జీవనోపాధిపై ఎనలేని ప్రభావం చూపుతోంది.

చెమ్మగిల్లుతోన్న చెరువు..

చెరువు.. ఊరికి ఆదెరువు. మడికొండ చుట్టుపక్కల పంట పొలాలకు చెరువునీరు ఆధారంగా ఉండేది. ఈ నీటితో సమృద్ధిగా పంటలు పండించేవారు. 2011లో డంపింగ్‌ యార్డు ఏర్పాటైన తర్వాత చెరువు నీరు కలుషితమవుతోంది. దీంతో చుట్టుపక్కల వ్యవసాయ క్షేత్రాల్లో పంటల దిగుబడి సైతం తగ్గిందని స్థానికులు వాపోతున్నారు. కాగా, మడికొండ పెద్ద చెరువులో కలుషితమైన నీరు సోమిడి చెరువుకు చేరుతుంది. అక్కడి నుంచి వడ్డేపల్లి పెద్ద చెరువులోకి చేరుతుంది. ఇలా ఆయా చెరువులు కలుషితమవుతున్నాయి. పంటలు దెబ్బతింటున్నాయి.

మడికొండలోని డంపింగ్‌ యార్డుతో ప్రశ్నార్థకంగా కులవృత్తులు

ముదిరాజ్‌, గీత కార్మికుల

జీవనోపాధిపై ప్రభావం

యార్డును తొలగించాలని డిమాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement