అక్కడ యుద్ధం.. | - | Sakshi
Sakshi News home page

అక్కడ యుద్ధం..

Mar 14 2026 10:18 AM | Updated on Mar 14 2026 10:18 AM

ఇక్కడ ఆందోళన!

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:

మెరికా, ఇజ్రాయిల్‌, ఇరాన్‌ యుద్ధ ప్రభావం పరోక్షంగా ఉమ్మడి వరంగల్‌ ప్రాంతంలోని రైతులు, వ్యాపారులు, సాధారణ ప్రజలపై పడుతోంది. ఇప్పటికే వంటింటిపై ఎల్పీజీ గ్యాస్‌ బండ భారమవుతోంది. గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో చిన్న చిన్న హోటళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, టీ పా యింట్లు మూతపడుతున్నాయి. పబ్లిక్‌ గార్డెన్‌, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ, కేయూసీ ప్రాంతాల్లో ఉదయం వాకింగ్‌ చేసేవారికి రాగి జావా, జొన్న గట్క ఇవ్వలేకపోతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.

వ్యవసాయ రంగంపైనా..

ఉమ్మడి వరంగల్‌ ప్రాంతంలో సుమారు 4.27 లక్షల మంది రైతులు, 5 లక్షలకుపైగా వ్యవసాయ కూలీలు ఉన్నారు. ధరల పెరుగుదలతో సాగు వ్యయం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి.

ఇంధన వినియోగం ఎక్కువ..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నెలకు సుమారు 40–50 లక్షల లీటర్ల పెట్రోల్‌, 70–80 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగిస్తున్నారు. ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి మార్కెట్‌లో వస్తువుల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. మొత్తంగా ఈ ప్రభావం సుమారు 13 లక్షల మందిపై పడుతుందని అంచనా. ఉమ్మడి వరంగల్‌లో ఏటా యూరియా 1.3 – 1.5 లక్షల టన్నులు, డీఏపీ 60 – 70 వేల టన్నులు, పొటాష్‌ 25 – 30 వేల టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 80 – 90 వేల టన్నుల వినియోగం ఉంటుంది. ప్రపంచ మార్కెట్‌లో ఎరువులు ముడి పదార్థాల సరఫరాపై ప్రభావం పడితే ధరలు పెరిగే అవకాశం ఉంటుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. కాగా, డీజిల్‌, ఎరువుల ధరలు పెరిగితే సాగు ఖర్చులు పెరుగుతాయని ఎల్క తుర్తి మండలానికి చెందిన రైతు నిరంజన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్‌, ఇంధన ధరలు పెరిగితే కుటుంబ ఖర్చులు పెరుగుతాయి, చిరువ్యాపారస్తులపై భారం పడుతోంది’ అని టీ పాయింట్‌ నిర్వాహకుడు, గ్యాస్‌ వినియోగదారుడు సాయి సిద్ధార్థ్‌ చెప్పారు.

వ్యాపార వాణిజ్య రంగంలో ఆందోళన..

వ్యాపారులు, ట్రాన్స్‌పోర్ట్‌ రంగం ఇతర వృత్తుల్లో పనిచేసేవారి సంఖ్య 4,46,399 మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు, సరుకుల ధరలపై ప్రభావం పడుతోంది. గృహ పరిశ్రమలు/చిన్న పరిశ్రమల్లో పనిచేసేవారు 34,820 మంది ఉండగా.. ముడి పదార్థాల ధరలు పెరిగితే ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి. మొత్తంగా ఉమ్మడి వరంగల్‌లో అన్ని రంగాల్లో పనిచేసే జనాభా 17,05,655 మంది ఉండగా.. యుద్ధాల వల్ల వస్తువుల ధరలు పెరగడం వల్ల ఈ వర్గాలందరికీ పరోక్ష ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

వంటింటిపై తీవ్ర ప్రభావం..

మొదలైన గ్యాస్‌ సిలిండర్ల కొరత

టిఫిన్‌ సెంటర్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ కేంద్రాలకు దెబ్బ

వ్యవసాయం సహా పలు రంగాలపై ఎఫెక్ట్‌ చూపే అవకాశం

ఉమ్మడి వరంగల్‌పై పరోక్ష ప్రభావం

ఈ ఫొటోలో దిగాలుగా కూర్చున్నది మునగాల కల్యాణ్‌కుమార్‌. హనుమకొండ పబ్లిక్‌ గార్డెన్‌ వద్ద రోజూ ఉదయం రాగి జావా, జొన్నగట్క, మొలకల స్టాల్‌ ఏర్పాటు చేసి వాకర్లకు విక్రయిస్తుంటాడు. రెండు రోజులనుంచి మొలకలు మాత్రమే విక్రయిస్తున్నాడు. రాగి జావా, జొన్న గట్క ఎందుకు పెట్టడం లేదని అడిగితే ‘గ్యాస్‌ అయిపోయింది. ఇంతకుముందు బుక్‌ చేసిన వెంటనే సిలిండర్‌ ఇచ్చేవారు. ఇప్పుడు ఇవ్వడం లేదు. రెండు రోజులుగా రాగి జావా, జొన్న గట్క తయారు చేయడం లేదు’ అని సమాధానమిచ్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement