విభజనలో గందరగోళం | - | Sakshi
Sakshi News home page

విభజనలో గందరగోళం

Feb 12 2026 11:32 AM | Updated on Feb 12 2026 11:32 AM

విభజనలో గందరగోళం

విభజనలో గందరగోళం

విభజనలో గందరగోళం

మంజూరైన పోస్టులకు.. కేటాయింపులకు లేని పొంతన

హన్మకొండ: విద్యుత్‌ ఉద్యోగుల విభజనలో గందరగోళం నెలకొంది. ఉద్యోగుల కేటాయింపులో పారదర్శకత లోపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాచ్‌మెన్లు, స్వీపర్ల కేటాయింపులో సమ ప్రాధాన్యం కొరవడిందని అధికారులు, ఉద్యోగులు పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజన జరిగిన క్రమంలో పూర్వ వరంగల్‌ సర్కిల్‌ పరిధి ఉద్యోగులను నూతన జిల్లాల వారీగా విభజించారు. జిల్లాల విభజన క్రమంలో హనుమకొండ, వరంగల్‌ జిల్లాలు ఏర్పాటయ్యాయి. దీంతో ఈ రెండు జిల్లాల మధ్య మరోసారి ఉద్యోగుల విభజన చేయాల్సి వచ్చింది.

కాలయాపన..

జిల్లాల విభజన సమయంలో అన్ని స్థాయి అధికారులు, ఉద్యోగులను విభజించిన యాజమాన్యం, వాచ్‌మెన్‌, స్వీపర్‌ పోస్టులను విభజించలేదు. ఈ ఉద్యోగుల విభజనకు ముందుగా టీజీ ఎన్పీడీసీఎల్‌ ఫైనాన్స్‌ సీజీఎం చైర్మన్‌గా వరంగల్‌ అర్బన్‌ సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ కన్వీనర్‌గా, సంబంధించిన సర్కిల్‌ ఎస్‌ఈలు సభ్యులుగా కమిటీ వేశారు. ఈ కమిటీ కాలయాపన చేయడంతో చాలా రోజులుగా విభజన ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం ఎన్పీడీసీఎల్‌ ఆడిట్‌ సీజీఎం చైర్మన్‌గా మరోసారి విభజన కమిటీని యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వాచ్‌మెన్‌, స్వీపర్ల విభజన ప్రక్రియ చేపట్టగా విభజనలో అసమతుల్యత నెలకొంది. దీంతో వాచ్‌మెన్‌, స్వీపర్‌ల విభజన ప్రక్రియపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి.

కోల్పోయిన సమ ప్రాధాన్యం

టీజీ ఎన్పీడీసీఎల్‌ జారీ చేసిన ఎన్‌ఓఓ (సీజీఎం–హెచ్‌ఆర్డీ) ఎంఎస్‌ నంబర్‌ 138 ప్రకారం వాచ్‌మెన్‌ పోస్టులు హనుమకొండ సర్కిల్‌కు 22, వరంగల్‌ సర్కిల్‌కు 14 కేటాయించారు. అదే విధంగా ఎన్‌ఓఓ (సీజీఎం–హెచ్‌ఆర్డీ) ఎంఎస్‌ నంబర్‌ 164 ప్రకారం.. స్వీపర్‌ పోస్టులు హనుమకొండ సర్కిల్‌కు 16, వరంగల్‌ సర్కిల్‌కు 15 కెటాయించారు. ఇక్కడి వరకు భాగానే ఉన్న ఉద్యోగుల విభజనలో అధికారులు అవలంబించిన విధానంతో సమస్య తలెత్తింది. వాచ్‌మెన్‌, స్వీపర్ల సర్వీస్‌ సీనియార్టీ జాబితాను వేర్వేరుగా రూపొందించాల్సి ఉండగా.. ఇద్దరివీ కలిపి సీనియార్టీ జాబితాను రూపొందించి ఉద్యోగుల విభజన చేయడంతో సమ ప్రాధాన్యం కోల్పోయింది. రెండు సర్కిళ్లలో కలిపి మొత్తం 11 మంది వాచ్‌మెన్లు, 34 మంది స్వీపర్లు ప్రస్తుతం పని చేస్తున్నారు. హనుమకొండ సర్కిల్‌లో 22 వాచ్‌మెన్‌ పోస్టులుండగా.. నలుగురిని మాత్రమే కేటాయించారు. వరంగల్‌ సర్కిల్‌కు 14 వాచ్‌మెన్‌ పోస్టులుండగా ఏడుగురిని కేటాయించారు. స్వీపర్‌ పోస్టులు హనుమకొండ సర్కిల్‌లో 16 ఉండగా.. 23 మందిని కేటాయించారు. వరంగల్‌ సర్కిల్‌లో 15 పోస్టులుండగా.. 11 మంది ఉద్యోగులను కేటాయించారు.

పొంతనేది?

హనుమకొండకు మంజూరైన పోస్టులు లేకున్నా.. అదనంగా ఏడుగురు స్వీపర్లను కేటాయించారు. వరంగల్‌ సర్కిల్‌లో మంజూరైన పోస్టులకంటే నలుగురిని తక్కువగా కేటాయించారు. ఇక్కడున్న పోస్టులకు, పని చేస్తున్న ఉద్యోగులకు పొంతన లేకుండా పోయింది. హనుమకొండ సర్కిల్‌లో అధిక వాచ్‌మెన్‌ పోస్టులుండగా.. వాచ్‌మెన్లను నియమించాల్సి ఉండగా.. స్వీపర్లను అధిక సంఖ్యలో నియమించారు. దీంతో ఇక్కడ వాచ్‌మెన్ల కొరత నెలకొంది. స్వీపర్లు మహిళలు కావడంతో వాచ్‌మెన్‌ విధులు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఉద్యోగుల విభజన మేరకు సర్కిల్‌కు కేటాయించిన వారికి పోస్టింగ్‌లు ఇచ్చి వారిని హనుమకొండ నుంచి రిలీవ్‌ చేయాలని కోరుతూ.. వరంగల్‌ ఎస్‌ఈ లేఖ రాశారు. అయితే హనుమకొండ సర్కిల్‌ అధికారులు వారిని రిలీవ్‌ చేయలేదు. ఉద్యోగుల విభజన ఆమోదయోగ్యంగా లేదని హనుమకొండ సర్కిల్‌లోని పలువురు అధికారులు, ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాచ్‌మెన్‌, స్వీపర్ల సర్వీస్‌ సీనియార్టీని లెక్కించి వేర్వేరుగా జాబితా రూపొందించి విభజన చేస్తేనే సమ న్యాయం జరుగుతుందని అధికారులు, ఉద్యోగులు తెలిపారు.

వాచ్‌మెన్‌, స్వీపర్లను కలిపి

ఒకే సీనియార్టీ

సర్కిళ్లకు కేటాయింపులో

కుదరని సమ ప్రాధాన్యం

ఒక సర్కిల్‌కు వాచ్‌మెన్లు ఎక్కువ, మరో సర్కిల్‌కు స్వీపర్లు ఎక్కువ

వాచ్‌మెన్ల కొరతతో

ఎదురవనున్న ఇబ్బందులు

ఎన్పీడీసీఎల్‌ ఉద్యోగుల విడుదలకు

ఎస్‌ఈ అభ్యంతరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement