కొనసాగుతున్న మేడారం హుండీల లెక్కింపు
హన్మకొండ కల్చరల్: హనుమకొండ లష్కర్‌బజార్‌లోని తిరుమల తిరుపతి దేవస్థాన కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది. ఏడో రోజు బుధవారం రూ. 61,16,218 ఆదాయం లభించిందని మేడారం జాతర ఈఓ వీరస్వామి వెల్లడించారు. నోట్ల ద్వారా రూ.1,97,313, నాణెల ద్వారా రూ.58,26,635, విదేశీ కరెన్సీ ద్వారా రూ.92,270 కలిపి మొత్తం ఆదాయం రూ. రూ.61,16,218 లభించినట్లు తెలిపారు. కాగా, గతవారం రోజులుగా నిర్వహించిన లెక్కింపులో మొత్తం రూ.13,25,83,269 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. అదేవిధంగా దేవాదాయశాఖ జ్యువెల్లరీ వెరిఫికేషన్ ఆఫీసర్ కట్టా అంజనీదేవి ఆధ్వర్యంలో హుండీల్లో లభించిన బంగారం, వెండిని తూకం వేయించి లెక్కించారు. 486 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 31 కిలోల 700గ్రాముల వెండి లభించినట్లు తెలిపారు. గురువారం లెక్కింపు కొనసాగుతుందని ఆలయ ఈఓ వీరస్వామి తెలిపారు.


