మున్సిపల్ ఎన్నికల సమరం నేడే
సాక్షిప్రతినిధి, వరంగల్:
ఉమ్మడి వరంగల్‌లో 12 మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడగా.. మంగళవారం పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు జరిగే పోలింగ్‌లో అభ్యర్థుల భవిష్యత్ తేలనుంది. ఈ నేపథ్యంలో పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, కేసముద్రం మున్సిపాలిటీల్లో 3,35,244 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 525 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 106 సమస్యాత్మక, 99 అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన అధికారులు.. ఈ కేంద్రాల్లో పోలింగ్‌పై ప్రత్యేక నిఘా, బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 3,086 మంది పోలింగ్ అధికారులు, సిబ్బంది సామగ్రితో మంగళవారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
260 వార్డులు.. 1,074 మంది పోటీ
నామినేషన్ల ఉపసంహరణ తర్వాత సుమారు వారం రోజులపాటు హోరాహోరీగా జరిగిన ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు తెరపవడగా.. ఆఖరి రెండు రోజులు అన్ని పార్టీల అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. హనుమకొండ, వరంగల్‌లో మకాం వేసి జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, ములుగు, హనుమకొండ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో ప్రచారం చేశారు. ఆయా పార్టీల సీనియర్లు, ప్రముఖులు మెజార్టీ సభ్యుల గెలుపే లక్ష్యంగా మంత్రాంగం నిర్వహించారు. కాగా, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు 1074 మంది బరిలో నిలిచారు. ఇందులో కాంగ్రెస్ 248, సీపీఐ, సీపీఎం 12 వార్డులకు పోటీ చేస్తున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి 259 మంది, బీజేపీ అభ్యర్థులు 240 వార్డులకు కౌన్సిలర్లుగా తలపడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు 759 మంది కాగా, మిగతా 315 మంది బీఎస్పీ, ఏఐఎఫ్‌బీ, రెబల్స్, ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు 12 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను గెలుచుకునేందుకు సీరియస్‌గా ప్రయత్నం చేస్తుండగా, బీజేపీ సైతం ఈ ఎన్నికల్లో తమ సత్తా చూపాలని భావిస్తోంది. అయితే పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం నేతలు భారీగా ప్రచారం నిర్వహించినా.. గెలుపోటములపై వారు కచ్చితమైన అంచనాలకు రాలేకపోతున్నారు.
13న ఓట్ల లెక్కింపు..
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగి రీపోలింగ్ జరిపే అవకాశం ఉంటే.. గురువారం ఆ ప్రక్రియ ఉంటుంది. 13న ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 12 చోట్ల శుక్రవారం ఉదయమే మున్సిపల్ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇదిలా ఉండగా.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. వరంగల్ పోలీసు కమిషనరేట్‌లోని నర్సంపేట, పరకాల, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలో ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, 11 మంది ఏసీపీలు, 125 మంది ఇన్‌స్పెక్టర్లు కలిపి మొత్తం 1,100 మంది అధికారులు, సిబ్బంది ఈ ఎన్నికల బందోబస్తులో పాల్గొంటున్నారు. స్ట్రైకింగ్ ఫోర్స్, మొబైల్ పార్టీలు అనుక్షణం పోలింగ్ తనిఖీలు చేయనుండగా, రూట్, జోనల్ అధి కారులు ఎన్ని కల తీరును పర్యవేక్షించనున్నారు. పీఓలు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల సమాచా రాన్ని వెంటవెంటనే అధికారులకు అందించేవిధంగా ఏర్పాట్లు చేశారు.


