మహాశివరాత్రికి ఏర్పాట్లు చేయాలి
● అధికారులకు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని ఆదేశం
● వేయిస్తంభాల ఆలయంలో పోస్టర్ ఆవిష్కరణ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయంలో ఈనెల 14 నుంచి 18 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, వివిధ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఈఓ అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మతో కలిసి ఉత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని అన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చలువపందిళ్లు, ప్రథమ చికిత్స శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యశాఖ అధికారులకు ఆదేశించారు. రవాణా, పొలీస్‌శాఖల సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని, భక్తుల భద్రత కోసం పోలీస్ యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతుందని పేర్కొన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని గంగు ఉపేంద్రశర్మ పూర్ణకుంభంతో స్వాగతించారు. ఫ్లోర్‌లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ పోతుల శ్రీమాన్, డివిజన్ అధ్యక్షుడు కుమార్‌యాదవ్, సతీశ్, వివిధ శాఖల అధికారులు, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీకాన్ఫరెన్‌్స్ హాలులో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారితో కలెక్టర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వైద్యులు, సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు. వైద్యాధికారులు, సంబంధిత సూపరింటెండెంట్లు, గైనకాలజిస్టులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. యాక్షన్‌ప్లాన్ షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వ వైద్యాధికారులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ నాన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, ఇప్పటి వరకు నిర్వహించిన క్యాంపుల వివరాలను డీఎంహెచ్‌ఓ సమర్పించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎ.అప్పయ్య, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ గౌతంచౌహన్, జీఎంహెచ్ ఆర్‌ఎంఓ డాక్టర్ మంజుల, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రదీప్‌రెడ్డి, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు, హనుమకొండ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ జె.కిరణ్‌కుమార్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.
ఖిలా వరంగల్: చారిత్రక ఖిలా వరంగల్‌లోని రాతికోట ఆనుకొని ఉన్న అగర్త చెరువు పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులు కేటాయించింది. ఇటీవల కుడా ఆధ్వర్యంలో చెరువు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. పరిహారం ఇచ్చిన తర్వాతే అగర్త చెరువు పనులు చేపట్టాలని భూములు కోల్పోతున్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కుడా అధికారులు పనులు నిలిపివేసి మంగళవారం సర్వే ప్రారంభించారు. రాతికోట నుంచి ఎన్ని మీటర్ల వరకు కేంద్ర పురావస్తుశాఖ భూమి ఉంది, ఎంత వరకు నిషేధిత ప్రాంతం, ఎంత దూరం నుంచి నిర్మాణాలు చేపట్టవచ్చు, ఎన్ని పట్టా భూములు ఉన్నాయి, రికార్డుల ప్రకారం ఎవరికి ఎంత భూమి ఉంది, అగర్త చెరువు పునరుద్ధరిస్తే ఎవరికి ఎంత పరిహారం చెల్లించాల్సి వస్తుంది అనే వివరాలు సేకరిస్తున్నారు.
మహాశివరాత్రికి ఏర్పాట్లు చేయాలి


