జీఐతో వస్తువుకు ప్రత్యేక గుర్తింపు
రామన్నపేట : జీఐ(భౌగోళిక గుర్తింపు)తో ఒక వస్తువుకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌డీసీ) ప్రాంతీయ ఇన్‌చార్జ్ గణేశ్ తెలిపారు. బుధవారం వరంగల్ కొత్తవాడలోని పద్మశాలి ట్రస్ట్ ఫంక్షన్ హాల్‌లో వరంగల్ చేనేత దర్రీకి జీఐ ద్వారా ప్రపంచ గుర్తింపు లభించేలా చేనేత కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ శిబిరాన్ని జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ప్రాంతీయ ఇన్‌చార్జి గణేశ్, భౌగోళిక గుర్తింపు సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి తేజస్, వరంగల్ ప్రాంతీయ ఉప సంచాలకుడు జయరావు, వరంగల్ నేతదారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిప్ప వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రారంభించారు. గణేశ్ మాట్లాడుతూ భౌగోళిక గుర్తింపుతో ఎగుమతులు పెరగడంతోపాటు చేనేత ఉత్పత్తులకు అదనపు విలువ చేకూరుతుందన్నారు. ఈ గుర్తింపు ద్వారా నేతదారులు ఆర్థికంగా బలోపేతమవుతారన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త అవకాశాలు ఏర్పడతాయని వివరించారు. ఈ శిబిరంలో చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకుడు శ్రీకాంత్ రెడ్డి, టెస్కో జిల్లా నిర్వహణ అధికారి వెంకటేశ్వర్లు, వీవర్స్ సేవ కేంద్రం సహాయ సంచాలకుడు పుగులేంటి, హనుమకొండ అభివృద్ధి అధికారి సునీత, హస్తకళ సేవా కేంద్రం ప్రోత్సాహక అధికారి ప్రవీణ్ కుమార్, సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు పంతగాని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ
ప్రాంతీయ ఇన్‌చార్జ్ గణేశ్


