వృత్తి నైపుణ్యంతో ఆర్థికంగా ఎదగాలి
హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి
కాజీపేట అర్బన్: మహిళలు వృత్తి నైపుణ్యం సాధించి ఆర్థికంగా ఎదగాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి సూచించారు. కాజీపేట మండలం మడికొండలోని దుర్గాబాయి మహిళా శిశువికాస కేంద్రంలో టైలరింగ్, కంప్యూటర్, నర్సింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మంగళవారం సర్టిఫికెట్లను ఆయన అందజేసి మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, మహిళల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న ఫోర్టిఫైడ్ రైస్‌ను తప్పకుండా తినాలని కోరారు. స్వధార్‌హోంకు చెందిన 25 మంది టైలరింగ్, మహిళా ప్రాంగణం నుంచి 25 మంది టైలరింగ్, ఏఎన్‌ఎంలు 55 మంది, 25 మంది కంప్యూటర్‌లో శిక్షణ తీసుకున్నారు. ఏఎన్‌ఎంలకు కిట్‌లు, కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ప్రాంగణం మేనేజర్ జయశ్రీ, సిబ్బంది హేమారాణి, కల్యాణి, కృష్ణవేణి, మధు, పుష్ప తదితరులు పాల్గొన్నారు.


