అర్మాకొండను అధిరోహించిన యశ్వంత్
● శిఖరంపై త్రివర్ణ పతాకం ఎగరవేసిన పర్వతారోహకుడు
మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్య తండాకు చెందిన పర్వతారోహకుడు భూక్య యశ్వంత్ మరో విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎత్తైన అర్మాకొండ (1,680 మీటర్లు) (జిందగడ శిఖరం) పర్వతాన్ని ఆదివారం రాత్రి అధిరోహించి త్రివర్ణ పతాకం ఎరగవేశారు. దేశంలోని 28 రాష్ట్రాల్లోఎత్తైన శిఖరాలతో పాటు ఏడు ఖండాలలోని అతి ఎత్తైన ఏడు శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యం మేరకు యశ్వంత్ మరో మైలురాయి అధిగమించాడు. ఇప్పటికే భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అసోం, రాజస్తాన్‌తో పాటు ఒడిశాలోని ఎత్తైన శిఖరాలు అధిరోహించారు.
ప్రపంచ ప్రసిద్ధ పర్వతారోహణ
ఇప్పటికే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో (5,895 మీటర్లు), రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ (5,642 మీటర్లు), ఆస్ట్రేలియాలోని మౌంట్ కోసిస్కో (2,228 మీటర్లు), నేపాల్‌లోని మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (5,364 మీటర్లు), లడఖ్‌లోని మౌంట్ కాంగ్ యాట్సే–2 (6,250 మీటర్లు), అరుణాచల్ ప్రదేశ్‌లోని మౌంట్ గోరిచెన్ (6,488 మీటర్లు) పర్వతాలను అతి పిన్న వయస్కుడిగా విజయవంతంగా అధిరోహించారు. జాతీయ, అంతర్జాతీయ పర్వతాలను అధిరోహించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటాలనే లక్ష్యం మేరకు సాధన కొనసాగిస్తునట్లు యశ్వంత్ తెలిపారు.


