అట్టహాసంగా టీ–20 మహిళా క్రికెట్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ వేదికగా ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగనున్న అంతర్‌జిల్లాల టీ–20 మహిళా క్రికెట్ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కరుణాపురం సమీపం వంగాలపల్లిలోని డబ్ల్యూడీసీఏ మైదానం, వరంగల్ శివారు మొగిలిచర్ల క్రీడా మైదానంలో క్రికెట్ పోటీలు కొనసాగాయి. వంగాలపల్లి మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో మెదక్‌పై 56 పరుగుల తేడాతో వరంగల్ జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వరంగల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 113 పరుగులు సాధించింది. అనంతరం 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెదక్ కేవలం 12.4 ఓవర్ల ఎదుర్కొని 57 పరుగుల వద్ద అన్ని వికెట్లు కోల్పోయింది. మొగిలిచర్ల మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో నిజామాబాద్‌పై ఖమ్మం జట్టు 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నిజామాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు 16.1 ఓవర్లలో 103 పరుగులు చేసి విజేతగా నిలిచింది.
మొదటి రోజు వరంగల్ శుభారంభం


