టిప్పర్‌ను ఢీకొన్న గూడ్స్ ట్రాలీ.. యువకుడి దుర్మరణం
ఆత్మకూరు : దైవ దర్శనానికి వెళ్లొస్తూ.. ఓ యువకుడు మృత్యుఒడికి చేరాడు. గూడ్స్ ట్రాలీ..టిప్పర్‌ను ఢీకొన్న ప్రమాదంలో దుర్మరణం చెందాడు. అలాగే, ఒకరికి స్వల్పంగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలకేంద్రం సమీపంలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. సీఐ సంతోష్ కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన బోడ శేఖర్(28)తోపాటు మరో ఆరుగురు మొత్తం ఏడుగురు గూడ్స్ ట్రాలీలో ఆదివారం మేడారం వెళ్లారు. తల్లుల దర్శనం అనంతరం తిరిగొస్తున్న క్రమంలో ఆత్మకూరు సమీపంలో ముందు వెళ్తున్న టిప్పర్‌ను ట్రాలీ ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ పక్కన కూర్చున్న బోడ శేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ బుర్ర శివకు స్వల్ప, దైత అనిల్, యామనగంటి వెంకన్న, జిల్ల ప్రవీణ్‌తోపాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగ్రాతులను 108లో వరంగల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంతోష్ తెలిపారు.


