భక్తుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా..
ములుగు: ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారం జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తుల ఆరోగ్య రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయడమే కాకుండా జాతర పరిసర ప్రాంతాల్లో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ సుమారు 800 మంది వైద్యులతో భక్తులకు మెరుగైన సేవలు అందించనుంది. 5,192 మంది మెడికల్, పారా మెడికల్ సిబ్బందిని రంగంలోకి దించింది. జాతర సమయంలో 24 గంటలు వైద్య సేవలందించేందుకు గాను 649 వైద్యాధికారులు, 154 మంది ఆయుష్ వైద్యాధికారులు, 673 నర్సింగ్ అధికారులు, 1,905 ఆశ వర్కర్లు, 1,111 పారామెడికల్ సిబ్బంది, 331 సూపర్‌వైజర్ స్టాఫ్, 700 మంది ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు.
జాతర అనంతరం 10 మెడికల్ క్యాంపులు
జాతర ముగిసిన అనంతరం కూడా స్థానిక గిరిజనులకు ఏ విధమైన ఆరోగ్య సమస్యలు కలగకుండా 10 మెడికల్ క్యాంపులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు మేడారం చుట్టూ పక్కల ఉన్న ఏటూరు నాగారం, ములుగు, పస్రా, గోవిందరావు పేట, మంగపేట సి.ఎస్.సి. ఆస్పత్రులను పటిష్టపరిచారు. జాతర తిరుగువారం వరకు వైద్యసేవలు అందించనున్నారు.
జంపన్నవాగు వద్ద 325 మంది సిబ్బంది
మేడారం భక్తులు విధిగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇందులో ప్రమాదవశాత్తు పడి ప్రమాదాలకు గురి కాకుండా వాగు పొడువునా స్విమ్మర్లు, సింగరేణి, ఎస్.డి.ఆర్.ఎఫ్ సిబ్బందిని మొత్తం 325 మందిని నియమించారు.
అగ్ని ప్రమాదాలు జరగకుండా 268 సిబ్బంది
జాతర పరిధిలో ఏ విధమైన అగ్నిప్రమాదాలు జరగకుండా రాష్ట్ర అగ్నిమాపక శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. 15 ఫైర్ బ్రిగేడ్స్, 12 మిస్ట్ బుల్లెట్స్, రెండు ఫైర్ ఇంజిన్లను జాతర ప్రాంగణంలో మోహరించారు. మొత్తం 268 ఫైర్ సిబ్బంది జాతరలో విధుల్లో పాల్గొంటారు.
మేడారంలో 800 మంది వైద్యులతో సేవలు
50 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
జాతర పరిసర ప్రాంతాల్లో
30 వైద్య శిబిరాలు
భక్తుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా..


