ఇంతింతై వటుడింతై..
ఏటేటా పెరుగుతున్న మేడారం ఆదాయం
ములుగు: రెండేళ్లకు ఒకసారి జరిగే ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఆదాయం ఇంతింతై వటుడింతై అన్నట్లు ఏటేటా పెరుగుతోంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం ప్రసిద్ధి చెందింది. ఈ క్రమంలో ఈ జాతరకు వచ్చే భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయం కూడా క్రమంగా పెరుగుతూ రికార్డు సృష్టిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం కూడా భక్తుల సౌకర్యార్థం నిధులు కేటాయిస్తూ సౌకర్యాలు కల్పిస్తోంది.
1946లో గిరిజనులు మాత్రమే
జరుపుకున్న జాతర..
1946లో చిలకలగుట్టపై గిరిజనులు మాత్రమే మేడారం సమ్మక్క సారలమ్మను జాతర జరుపుకున్నారు. దీనికి 15వేలకు పైగా మంది భక్తులు హాజ రుకాగా రూ. 17,173 ఆదాయం సమకూరింది. 1958లో అధికారికంగా మేడారం జాతరను రెవె న్యూ రికార్డుల్లో చేర్చారు. దీంతో 1970లో అప్పటి ప్రభుత్వం జాతరను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. అనంతరం 1996లో మేడారాన్ని రాష్ట్ర జాతరగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది. 1996 నుంచి మేడారం జాతర ఆదాయంలో ప్రభుత్వానికి 67శాతం, పూజారులకు 33 శాతం వాటా ఇచ్చేలా ఒప్పందం జరిగింది. 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించి భక్తుల సౌకర్యాలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. 2014లో జరిగిన జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అంచనా వేసి ప్రభుత్వం రూ.60 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ నెల 28 నుంచి జరగనున్న మేడారం మహాజాతరకు మూడు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన ప్రభుత్వం.. భక్తుల సౌకర్యాల కోసం రూ.150 కోట్లు విడుదల చేయగా పనులు 90శాతం మేర పూర్తయ్యాయి.
పెరుగుతున్న భక్తులు, ఆదాయం
రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతర ఆదాయ వివరాలను పరిశీలిస్తే, భక్తుల సంఖ్య పెరగడంతోపాటు ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. జాతర ద్వారా వచ్చిన హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ, కోయ పూజారుల మధ్య 67:33 నిష్పత్తిలో పంచుతారు. మొత్తం 13 మంది పూజారులు 33శ ాతం ఆదాయాన్ని సమానంగా పంచుకుంటారు. ప్రభుత్వం హుండీ ఆదాయంపై ఆధారపడకుండా, భక్తుల సౌకర్యార్థం ప్రతీ జాతరకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులు ప్రధానంగా మౌలిక సదుపాయాలు, రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, భద్రత, తదితర ఏర్పాట్ల కోసం ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఈసారి తల్లుల గద్దెల ప్రాంగణాన్ని రూ.101 కోట్లతో అభివృద్ధి చేసి ముఖ్యమంర్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈనెల 19న ప్రారంభించారు. ఈనెల 28 నుంచి 31 వరకు సమ్మక్క సారలమ్మ మహాజాతర అంగరంగవైభవంగా జరగనుంది.
2014 నుంచి మేడారం జాతర ఆదాయం..
2014: రూ. 7.43 కోట్లు
2016: రూ. 8.91 కోట్లు
2018: రూ. 10.17 కోట్లు
2020: రూ. 11.64 కోట్లు
2022: రూ. 11.44 కోట్లు
(2020 కంటే 20 లక్షలు తక్కువ)
2024 : రూ. 13.25 కోట్లు (రికార్డు)
2014 నుంచి మేడారం జాతరకు
కేటాయించిన నిధులు
2014: రూ. 60 కోట్లు
2016: రూ. 108 కోట్లు
2018: రూ. 85 కోట్లు
2020: రూ. 75 కోట్లు
2022: రూ. 75 కోట్లు
2024: రూ. 105 కోట్లు
2026: రూ.150 కోట్లు
1996లో రాష్ట్ర జాతరగా గుర్తింపు
2014 రాష్ట్ర పండుగగా గుర్తించి
నిధులు కేటాయింపు
రూ. 17 వేల ఆదాయం నుంచి
రూ. 13 కోట్ల వరకు..
ఆదాయంలో 67 శాతం ప్రభుత్వానికి, 33 శాతం పూజారులకు వాటా


