అమ్మవార్ల దర్శనానికి అక్కాచెల్లెళ్లకు ఉచిత ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

అమ్మవార్ల దర్శనానికి అక్కాచెల్లెళ్లకు ఉచిత ప్రయాణం

Jan 25 2026 6:47 AM | Updated on Jan 25 2026 6:47 AM

అమ్మవార్ల దర్శనానికి అక్కాచెల్లెళ్లకు ఉచిత ప్రయాణం

అమ్మవార్ల దర్శనానికి అక్కాచెల్లెళ్లకు ఉచిత ప్రయాణం

ములుగు: మేడారంలోని సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు అక్కాచెల్లెళ్లకు రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని కొనసాగిస్తూ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క–సారలమ్మను రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్క, మహబూబాబాద్‌ ఎంపీ పోరిక బలరాంనాయక్‌తో కలిసి శనివారం దర్శించుకున్నారు. అనంతరం మేడారం తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడారు. వచ్చే జాతర వరకు మేడారంలో శాశ్వత బస్టాండ్‌ నిర్మిస్తామని, షెడ్లతో శాశ్వత క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. మేడారం జాతరకు 4 వేల బస్సులు నడుపుతున్నట్లు, భక్తుల రద్దీని బట్టి మరిన్ని బస్సులు నడిపిస్తామన్నారు. జాతరలో పిల్లలు తప్పిపోకుండా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో 11 బస్‌ పాయింట్లలో చైల్డ్‌ ట్రాకింగ్‌ సిస్టం ఉపయోగి స్తున్నట్లు తెలిపారు. భక్తులు తప్పనిసరిగా తమ పిల్లలకు స్టిక్కర్‌తో కూడిన ట్యాగ్‌ను చేతికి వేయించాలని సూచించారు. ఫిబ్రవరి 1వరకు మేడారానికి ఆర్టీసీ సేవలు కొనసాగించనున్నట్లు తెలిపారు. భక్తులు తమ ప్రయాణాన్ని సురక్షితంగా పూర్తి చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ 2024లోనే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మేడారం జాతరకు రవాణా, మౌలిక వసతులు కల్పించాలనే దూర దృష్టితో ముందడుగు వేశారని గుర్తు చేశారు. జాతర సందర్భంగా అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడమే కాకుండా, ఈసారి మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్వయంగా మేడారానికి వచ్చి రవాణా ఏర్పాట్లను పరిశీలించారని తెలిపారు. భక్తులు, ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యాలు ఎదుర్కొకుండా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కాగా, మంత్రి ప్రభాకర్‌ తన తులంభారంగా 89 కిలోల బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించారు. కార్యక్రమంలో స్పెషల్‌ ఛీఫ్‌ సెక్రటరీ వికాస్‌రాజ్‌, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ములుగు కలెక్టర్‌ దివాకర టీఎస్‌, ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌, ఆర్టీసీ ఉన్నతాధికారులు,తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

మేడారంలో తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement