జాతరకు ఆర్టీసీ సిద్ధం
ఏడు ప్రైవేట్ పెట్రోల్, డీజిల్
బంకులు లీజ్‌కు..
హన్మకొండ: మేడారం జాతరకు ఆర్టీసీ సమాయత్తమైంది. ఈనెల 28, 29, 30, 31 తేదీల్లో వన దేవతల జాతర జరగనుంది. భక్తులను చేరవేసేందుకు ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు ప్రత్యేక బస్సులు నడపనుంది. మేడారంలో ప్రత్యేక బస్ పాయింట్‌ను ఈనెల 24న(నేడు) మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఈసారి జాతరకు ఆర్టీసీ బస్సుల ద్వారా 20 లక్షల మంది వరకు భక్తులు ప్రయాణం చేస్తారని అధికారుల అంచనా. 51 బస్ పాయింట్ల నుంచి భక్తులను మేడారానికి చేరవేసేందుకు 3,495 ప్రత్యేక బస్సులు సిద్ధంగా ఉంచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 31 ప్రత్యేక పాయింట్లు, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 21 పాయింట్లు, మహారాష్ట్రలోని సిరోంచ నుంచి కూడా బస్సులు నడిపించనున్నారు. వరంగల్ రీజియన్‌లో మొత్తం 1,100 బస్సులు నడుపనున్నారు. ఇందులో 150 కొత్త బస్సులు రానున్నాయి. మిగతా బస్సులను హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్ రీజియన్ల నుంచి సమకూర్చుకున్నారు. మిగిలిన ప్రత్యేక బస్సులు ఇతర రీజియన్లలోని ప్రత్యేక పాయింట్ల నుంచి నడుపుతారు.
విధుల్లో 11 వేల మంది సిబ్బంది..
● మేడారం జాతరలో మొత్తం 11 వేల మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.
● మేడారంలో 50 ఎకరాల స్థలంలో ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 35 ఎకరాల్లో బస్‌ల పార్కింగ్, బస్‌ల మరమ్మతులకు షెడ్, కార్మికులు, అధికారులకు వసతి, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు బస్సుల్లో తిరిగి వెళ్లేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు 20 ఎకరాల్లో తాత్కాలిక బస్‌స్టేషన్, భక్తులు బస్సుల్లోకి చేరేందుకు రెయిలింగ్, 50 క్యూ లైన్లు సిద్ధం చేశారు. తాడ్వాయి వద్ద 10 ఎకరాల్లో పార్కింగ్, టికెట్ల జారీకి ఏర్పాట్లు చేశారు. కామారంలో 10 ఎకరాలు, మహావీర్ వద్ద 8 ఎకరాలు బస్సుల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. మేడారంతోపాటు వివిధ ప్రాంతాల్లోని ఆర్టీసీ తాత్కాలిక బస్‌స్టేషన్లలో భక్తులకు చలువ పందిళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలల సౌకర్యం కల్పించారు.
78 సీసీ కెమెరాలు ఏర్పాటు..
● మేడారంలో ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంతంలో 78 సీసీ కెమెరాలు బిగించారు. వాటిని ఆర్టీసీ కమాండ్ కంట్రోల్ రూం, పోలీసు కమాండ్ కంట్రోల్ రూంకు కూడా అనుసంధానించారు. కాజీపేట, హనుమకొండ, వరంగల్ ప్రత్యేక బస్ పాయింట్లలో సర్వేలైన్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. తిరుగు ప్రయాణం భక్తులను నేరుగా బస్సు ఎక్కించి తాడ్వాయిలో టికెట్లు ఇస్తారు. ఆర్టీసీ ఉద్యోగులు అస్వస్థతకు గురైతై వెంటనే వైద్య సేవలు అందించేందుకు ఆర్టీసీతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ మేడారంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. తాడ్వాయి వద్ద స్టాటికల్ సిబ్బందిని ఉంచి ఎన్ని బస్సుల్లో ఎంత మంది భక్తులు వచ్చారో నివేదిక తయారు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మేడారంలో కార్మికులు విశ్రాంతి తీసుకునేందుకు షెడ్లు వేశారు. రాత్రి సమయంలో లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
● జాతరలో విధులు నిర్వర్తించే అధికారులు, ఉద్యోగులకు తాగు నీటి వసతికి 9 ఆర్‌ఓ వాటర్‌ప్లాంట్లను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. అధికారులు, సిబ్బందితో పాటు బస్సు బోర్డింగ్ పాయింట్లలో భక్తులకు శుద్ధిచేసిన నీటిని అందిస్తారు. ఆర్టీసీ ఉద్యోగులకు రాయితీపై భోజన సౌకర్యం కల్పించారు. దీని కోసం ప్రత్యేక క్యాంటీన్ ఏర్పాటు చేశారు. భోజనం రూ.20, అల్పాహారం రూ.10, టీ రూ.7గా నిర్ణయించారు.
రేపటి నుంచి ప్రత్యేక బస్సులు ప్రారంభం
51 కేంద్రాల నుంచి మేడారానికి 3,495 సర్వీస్‌లు
నేడు మేడారంలో
బస్ పాయింట్ ప్రారంభం
ఆర్టీసీ బస్సుల్లో ఇంధనం నింపుకునేందుకు మేడారం రూట్‌లో ఏడు ప్రైవేట్ పెట్రోల్, డీజిల్ బంకులను లీజ్‌కు తీసుకున్నారు. మల్లంపల్లిలో రెండు, చెల్పూరు, భూపాలపల్లి, జవహర్‌నగర్ నగర్, చిన్నబోయినిపల్లి, గోవిందరావుపేటలో ఒక్కో ప్రైవేటు పెట్రోల్ బంకును లీజుకు తీసుకున్నారు. మేడారం, తాడ్వాయి, పస్రా, గట్టమ్మ వద్ద బస్సుల మరమ్మతు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఆరుగురు మెకానిక్‌లు, ఇద్దరు ఎలక్ట్రీ షియన్లు పని చేస్తారు. ఈ కేంద్రాలతో పాటు 13 మెయింటెనెన్స్ కేంద్రాలు, 15 మొబైల్ వ్యాన్లు, 10 మోటార్ సైకిల్ స్క్వాడ్స్, రెండు క్రేన్లు, 25 ట్రాక్టర్‌ను సమకూర్చుకున్నారు. ప్రతి మొబైల్ వ్యాన్‌లో ఒక మెకానిక్, ఒక ఎలక్ట్రీషియన్ ఉంటారు. 12 పెట్రోలింగ్, రిలీఫ్ స్క్వాడ్ బృందాలు, ఒక్క పెట్రోలింగ్ వాహనంలో ఒక అధికారి, సెక్యూరిటీ, మెకానిక్‌తో పాటు వైర్‌లెస్, మొబైల్ ఫోన్ కలిగి ఉంటారు. బస్సులకు సమస్య ఉత్పన్నమైనా, ట్రాఫిక్ జామ్ అయినా వీరు వెంటనే చేరుకుని క్లియర్ చేస్తారు. ప్రతి 20 కిలో మేటర్లకు ఒక పెట్రోలింగ్ స్టాఫ్ ఉంటారు.
గత ఐదు జాతర్లలో బస్సులు, ప్రయాణికులు, ఆదాయం వివరాలు..
సంవత్సరం 2014 2016 2018 2020 2,022 2,024
బస్సుల సంఖ్య 3,331 3,382 3,563 3,546 3,845 3,491
నడిచిన బస్సుల ట్రిప్పులు 37,963 41,01 46,815 50,600 54,566 36,450
ప్రయాణికుల చేరవేత (లక్షల్లో) 15.32 14.86 17.54 19.10 10.86 16.83
ఆదాయం రూ.కోట్లలో 21.00 24.16 26.46 30.07 21.81 38.05
భక్తులు ఆందోళన చెందొద్దు..
భక్తులను సురక్షితంగా, సుఖవంతంగా మేడారానికి చేరవేస్తాం. తిరుగు ప్రయాణంలో బస్సులు లేవనే ఆందోళన చెందొద్దు. భక్తులకు సరిపడా బస్సులు ఉన్నాయి. నైపుణ్యం కలిగిన డ్రైవర్లతో బస్సులు నడుపుతాం. బస్సులు కండీషన్ ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రత్యేక బస్ పాయింట్లలో భక్తులకు సౌకర్యం కల్పించాం. క్యూలైన్ల ద్వారా వెళ్తే తోపులాట లేకుండా బస్సుల్లోకి చేరుకుంటారు.
– దర్శనం విజయభాను,
ఆర్టీసీ వరంగల్ ఆర్‌ఎం
జాతరకు ఆర్టీసీ సిద్ధం
జాతరకు ఆర్టీసీ సిద్ధం


