అభివృద్ధి పనుల్లో ఆలస్యమెందుకు?
వరంగల్ అర్బన్: టెండర్లు, అగ్రిమెంట్లు పూర్తయినా అభివృద్ధి పనులు ప్రారంభించడంలో ఆలస్యమెందుకని నగర మేయర్ గుండు సుధారాణి ఇంజనీర్లపై అసహనం వ్యక్తం చేశారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో అభివృద్ధి పనులపై గురువారం మేయర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు స్పందించకపోతే నోటీసులు ఇచ్చి టెండర్ రద్దు చేసి, రీకాల్ చేయాలని మేయర్ సూచించారు. అనంతరం హనుమకొండ బాలసముద్రంలోని వెహికిల్ షెడ్డును మేయర్ తనిఖీ చేశారు. సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ వాహనాల మరమ్మతుల్లో వేగం పెంచాలని సూచించారు. సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈలు రవికుమార్, మాధవీలత, మహేందర్, డీఈలు కార్తీక్‌రెడ్డి, రాజ్‌కుమార్, రాగి శ్రీకాంత్, శానిటరీ సూపర్‌వైజర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయండి
నగర మేయర్ గుండు సుధారాణి


