మహాశివరాత్రి, రంజాన్‌కు పటిష్ట ఏర్పాట్లు
● హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: జిల్లాలో మహాశివరాత్రి, రంజాన్ పండుగల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ స్నేహ శబరీష్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మహాశివరాత్రి సందర్భంగా నగరంలోని ప్రధాన శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని వసతులు కల్పించాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహించాలని సూచించారు. రంజాన్ ప్రార్థనల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ముసీదులు, ఈద్గా ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, మంచినీటి సదుపాయం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ గతంలో చేసిన ఏర్పాట్ల కంటే ఈసారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, దేవాదాయ శాఖ ఉప కమిషనర్ రామల సునీత, జిల్లా అదనపు కలెక్టర్ రవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ అజీజ్ ఖాన్, డీఆర్‌ఓ వైవీ గణేశ్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, ఏసీపీ నరసింహారావు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ మధుసూదన్, ఇతర శాఖల అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు.


