మహాజాతరలో మెరుగైన వైద్యసేవలు
ఆర్టీసీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం
ఎంజీఎం : మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పెషలిస్ట్ డాక్టర్లతో మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎంజీఎం ఆస్పత్రిలో మేడారం మహాజాతర సందర్భంగా భక్తులకు అందించాల్సిన వైద్యసేవలపై హరీష్ చంద్రారెడ్డి అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, వైద్యఆరోగ్య శాఖ అధికారులు, సమన్వయ కర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ములుగు జిల్లాకు దగ్గరగా ఉన్న ములుగు, నర్సంపేట, భూపాలపల్లి మెడికల్ కాలేజీలు, అన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న స్పెషలిస్ట్ వైద్యులను జాతరలో వైద్యసేవల కోసం డిప్యూటేషన్ ద్వారా తీసుకోవాలని నిర్ణయించారు. వీరితో పాటు అన్ని ఉమ్మడి జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని కమిటీలో చర్చించినట్లు వివరించారు. సమావేశంలో ఉమ్మడి వరంగల్ డీఎంహెచ్‌ఓలు సాంబశివరావు, అప్పయ్య, గోపాల్ రావు, మధుసూదన్, రవిరాథోడ్, మల్లికార్జున్, జనగామ సూపరింటెండెంట్ డాక్టర్ గోపాలరావు, విజయలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, ప్రోగ్రాం ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ : మహాజాతరకు వచ్చే భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ రవాణా సౌకర్యంతో పాటు, వైద్యసేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 3,860 ప్రత్యేక బస్సులు నడపాలని వీటి ద్వారా 20లక్షలకు పైగా భక్తులు ప్రయాణిస్తారనే అంచనా వేశారు. అందుకు అవసమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో వచ్చే భక్తులకు వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మేడారంలో ఆరుగురు డాక్టర్లు, సిబ్బందిచే ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. నాలుగు అంబులెన్స్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రయాణికులతో పాటు ఆర్టీసీ సిబ్బందికి కూడా ఇక్కడి వైద్య శిబిరంలో చికిత్స అందించనున్నారు.
ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్
డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి


