ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, ఉన్న దాంట్లో సంతృప్తిగా బతకడం నేర్చుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం అవినీతి వ్యతిరేక సంస్థ జ్వాల, లోక్‌సత్తా సంయుక్తంగా కలెక్టరేట్ ఆవరణలో ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్‌పై కలెక్టర్ స్నేహ శబరీష్ తొలి సంతకం చేసి అవినీతికి పాల్పడనంటూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అవినీతికి వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరిస్తున్నామని, అన్ని కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. జ్వాల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, లోక్‌సత్తా ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ప్రతిపనికి లంచం చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపరులకు శిక్షపడేలా పౌరులను చైతన్యం చేస్తామని, నిజాయితీ గల ఉత్తమ అధికారులను ప్రతి ఏటా సన్మానిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రవి, ఎల్‌బీ కళాశాల ఎన్‌సీసీ ఆఫీసర్ కెప్టెన్ ముండ్రాతి సదానందం, ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీసర్ శ్రీనివాస్, లోక్ సత్తా – జ్వాల సభ్యులు బుర్రి కృష్ణమూర్తి, పొట్లపల్లి వీరభద్రరావు, కామిడి సతీశ్‌రెడ్డి, బుద్దె సురేశ్, శశిధర్‌రెడ్డి, ఎన్‌సీసీ కేడెట్లు, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు.


