నగరాభివృద్ధికి సమష్టిగా పనిచేయాలి
నూతన సంవత్సర వేడుకల్లో కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: నూతన సంవత్సరంలో నగరాభివృద్ధికి సమష్టిగా పనిచేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. హనుమకొండలోని కమిషనర్ క్యాంపు కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కమిషనర్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. పుష్పగుచ్ఛాలు స్వీకరించేందుకు ఆమె నిరాకరించారు. పేద విద్యార్థుల కోసం దుస్తులు, నోట్‌బుక్స్, పెన్నులను అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు అందించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ సత్యనారాయణ, ఇన్‌చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నారాణి, సమ్మయ్య, ఈఈలు రవికుమార్, సంతోష్, ఎంహెచ్‌ఓ రాజేశ్, డీపీఆర్వో అయూబ్, ‘కుడా’ సీపీఓ అజిత్‌రెడ్డి, జేఏసీ అధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు.
మేయర్‌ను కలిసిన కమిషనర్
నగర మేయర్ గుండు సుధారాణిని ఆమె చాంబర్‌లో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మేయర్‌ను అధికారులు, ఉద్యోగులు కలిసి పుష్పగుచ్ఛం అందించారు.


