ఆగుతూ.. సాగుతూ!
వరంగల్: ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిలో వివిధ పథకాల కింద చేపట్టిన అభివృద్ధి పనులు ఆగుతూ.. సాగుతున్నాయి. నిధులు విడుదలై టెండర్లు నిర్వహించినా పనులు గ్రౌండింగ్ చేయడంలో తీవ్ర జాప్యమవుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ నాణ్యతగా పనులు చేపట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. సుమారు రూ.46 కోట్లతో వరంగల్ వెంకట్రామ జంక్షన్ నుంచి పోచమ్మమైదాన్ మీదుగా ఎంజీఎం జంక్షన్ వరకు ఐదేళ్ల క్రితం చేపట్టిన స్మార్ట్ రోడ్డు పనులు పాలకవర్గం గడువు పూర్తికావొస్తున్నా పూర్తి కాలేదు. ఈరహదారికి ఇరువైపులా ఫుట్‌పాత్‌లు నిర్మించేందుకు భవనాల ఎదుట అధికారులు ఆక్రమణలు తొలగించారు. నేటికి ఫుట్‌పాత్‌లు పూర్తి చేయకపోవడంతో పలు షాపుల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగేళ్ల క్రితం డీమార్ట్ ఎదుట ప్రారంభించిన పనులు పూర్తికాలేదు. స్మార్ట్‌రోడ్డులో భాగంగా రహదారిపై బీటీ లేయర్లు అసంపూర్తిగా వేశారు. అవి స్పీడ్‌బ్రేకర్లుగా మారడంతో దిచక్రవాహనదారులకు పాట్లు తప్పడం లేదు. ఇబ్బందులకు గురవుతున్నారు. అధికార పార్టీ నాయకుల అండతో భవనాల యజమానులు అడ్డుకోవడంతో రహదారి విస్తరణ పనులు జాప్యమవుతున్నాయి. స్మార్ట్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు గ్రేటర్ వరంగల్ మేయర్, కమిషనర్ ఆదేశాలు జారీ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తిచేయించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజాప్రతినిధులే అడ్డు..
● కాంట్రాక్టర్లు, ఇంజనీర్లకు సహకరించాల్సిన ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులకు అడ్డుగా మారుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోపాలస్వామిగుడి జంక్షన్ సమీపంలోని రోడ్డు విస్తరణకు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అడ్డుపడడం, భవన యజమాని కోర్టుకు వెళ్లడంతో అక్కడ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఈ రహదారికి ఇరువైపులా అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం కోసం వేసిన పైపులతో జలమయంగా మారుతోంది.
● పోలీస్ కమిషనరేట్ జంక్షన్ నుంచి ములుగు రోడ్డు వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు సైతం పశ్చిమ నియోజకవర్గానికి చెందిన అప్పటి ప్రజాప్రతినిఽధి అడ్డుపడినట్లు తెలుస్తోంది. దీంతో రోడ్డు పనులు అసంపూర్తిగా మారాయి. డ్రెయినేజీతోపాటు వెడల్పు జరిగితే ఈ రోడ్డుపై వాహనాలు వెళ్లేందుకు సులువుగా ఉండేది. ప్రస్తుత అధికార పార్టీకి చెందిన నాయకుడు సైతం రోడ్డు వెడల్పునకు జంకుతున్నట్లు సమాచారం.
● కాజీపేట డీజిల్ కాలనీ నుంచి వరంగల్ ములుగురోడ్డు వరకు చేపట్టిన స్మార్ట్‌సిటీ రోడ్డు పనులు పూర్తి కాలేదు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ములుగురోడ్డు వరకు రహదారి వెంట ఉన్న వ్యాపారులే ఇందుకు కారణమని, ప్రజాప్రతినిధులు సహరించకపోవడంతో పనులు పెండింగ్ పడినట్లు సమాచారం.
● వెంకట్రామ జంక్షన్ నుంచి ములుగురోడ్డు జంక్షన్ వరకు చేపట్టిన స్మార్ట్ రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. అదేవిధంగా కాశిబుగ్గ, పోచమ్మమైదాన్, వరంగల్ చౌరస్తాలో చేపట్టిన జంక్షన్ అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించడం లేదు.
● పోచమ్మమైదాన్ నుంచి రైల్వేస్టేషన్ వరకు నిర్మించిన సీసీ రోడ్డులో నాణ్యత లేకపోవడంతో అక్కడక్కడ పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ స్మార్ట్‌రోడ్డులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, అప్పటి తూర్పు ప్రజాప్రతినిధి వ్యాపారుల కోసం డివైడర్ స్థానంలో సిమెంట్ కాంక్రీట్ పోయించడంతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయలేదు.
అభివృద్ధి పనుల్లో కానరాని
నాణ్యతాప్రమాణాలు
నిధులు విడుదలైనా
గ్రౌండింగ్‌లో జాప్యం
పట్టించుకోని గ్రేటర్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు


