ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సిందే..
కాజీపేట: భూనిర్వాసితులతోపాటు స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే నినాదం క్రమేణా ఊపందుకుంటోంది. కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామ శివారులో శరవేగంగా సాగుతున్న రైల్వే మ్యాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టనున్నారు. నియామకాల్లో జిల్లా నిరుద్యోగ యువతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలనే నినాదం మొదలైంది. దాదాపు 40 ఏళ్లు పోరాట ఫలితంగా రెల్వే కోచ్ అండ్ వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ పరిశ్రమ ఏర్పాటుకు రైతులు 128 ఎకరాలకు పైగా భూములను ౖఅతి తక్కువ పరిహారంతో రెల్వే శాఖకు అప్పగించారు. భూనిర్వాసితులకు ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యం ఉంటుందని భూసేకరణ సమయంలో అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత ఎక్కడా కూడా ఆ ఊసే లేకపోవడంతో తెలంగాణ రైల్వే జేఏసీ సహకారంతో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో భూనిర్వాసితులు, జిల్లా నిరుద్యోగులు, రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు ఏకమవుతున్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే డిమాండ్‌తో రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరంగల్‌వాసుల చిరకాల వాంఛను హైదరాబాద్ నుంచి ఢిల్లీస్థాయిలో వినిపించడానికి సమాయత్తమవుతున్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, సంబంధిత మంత్రులను కలిసి వినతిపత్రాలు అందించాలని తీర్మానించారు.
ఉద్యోగాలు ఇవ్వాలి..
తాత, ముత్తాతల కాలం నుంచి దున్నుకుని బతుకుతున్న భూములను ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాగ్యం చేశాం. భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి. లేనిపక్షంలో పోరాటాలను ఉదృతం చేయాల్సి ఉంటుంది.
– గాదె యాదగిరి, బాధితుడు, అయోధ్యపురం
ప్రత్యేక జీఓ తీసుకురావాలి..
గతంలో ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్ రాష్ట్రంలోని కపూర్తాలలో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో భూనిర్వాసితులకు 38 శాతం, జిల్లాస్థాయిలో నిరుద్యోగ యువతకు 44 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇక్కడ అదేస్థాయిలో ప్రత్యేక జీఓతో ఉద్యోగాలు ఇవ్వాలి.
– దేవులపల్లి రాఘవేందర్, తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్
ఉద్యోగాలు ఇవ్వకుంటే పోరాటాలకు విలువ లేనట్టే..
పోరాటాల ఫలితంగా ఏర్పడిన రైల్వే మ్యాన్‌ఫాక్చరింగ్ యూనిట్‌లో స్థానిక యువత, భూనిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. లేనిపక్షంలో ఎన్నో ఏళ్లు చేసిన పోరాటాలకు విలువ లేనట్లే. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం గతంలో అనుసరించిన విధానం ద్వారా ప్రత్యేక జీఓ జారీ చేసి ఉద్యోగాలు ఇవ్వాలి.
– కోండ్ర నర్సింగరావు, తెలంగాణ రైల్వే జేఏసీ చైర్మన్
రైల్వే మ్యాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్‌లో స్థానికులు, భూనిర్వాసితులకు
ఉద్యోగవకాశాలు కల్పించాలి
రాజకీయ, ప్రజాసంఘాల
నాయకుల డిమాండ్
రైల్వే జేఏసీ నాయకుల
ఆధ్వర్యంలో పోరుబాటు
ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సిందే..
ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సిందే..


