ధరణి నవల ఆవిష్కరణ
హన్మకొండ కల్చరల్: చెలిమి సాహిత్య సాంస్కృతిక వేదిక వరంగల్ శాఖ, కాలేజీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెట్టు రవీందర్ రాసిన ‘ధరణి’ నవల పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. హనుమకొండ నక్కలగుట్టలోని కాలేజీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ భవనంలో చెలిమి వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు రవీందర్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్, విశిష్ట అతిథులుగా ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, రిటైర్డ్ తహసీల్దార్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుప్పాల బాలరాజు, ఆర్‌సీటీఏటీ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ విద్యాసాగర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు పులి సారంగపాణి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌తో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రచయిత ఈ నవలలో కళ్లకు కట్టినట్లుగా రాశారని ప్రశంసించారు. సాహితీవేత్తలు నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి, రామిరెడ్డి పాల్గొన్నారు.


