
నిమజ్జనం.. సర్వం సిద్ధం
చెరువుల పరిశీలన..
2,100 మందితో పటిష్ట బందోబస్తు : సీపీ
వరంగల్ అర్బన్: విశేష పూజలందుకున్న బొజ్జగణపయ్యకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు సర్వం సన్నద్ధమైంది. వరంగల్ మహా నగర వ్యాప్తంగా గణనాథులను వాహనాలపై కొలువుదీర్చి శోభాయాత్రతో ఆయా ప్రాంతాల్లోని 19 చెరువుల వద్ద శుక్రవారం నిమజ్జనం చేయనున్నారు. అందుకోసం వివిధ శాఖల అధికారులు, సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు. వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధి చిన్నవడ్డేపల్లి చెరువు, ఉర్సు రంగ సముద్రం, గొర్రెకుంట కట్ట మల్లన్న, గుండు చెరువు అగర్తలా, మామునూరు బెస్తం చెరువుల్లో నిమజ్జనం జరగనుంది. హనుమకొండ, కాజీపేటలోని సిద్ధేశ్వర గుండం, బంధం చెరువు, హసన్‌పర్తి పెద్ద చెరువు, గోపాలపురం, భీమారం, కడిపికొండ, మడికొండ, సోమిడి, ఎల్లాపూర్, గుండ్ల సింగారం, రాంపేట, రాంపూర్, సింగారం, చల్ల చెరువు వద్ద నిమజ్జన కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి. మేయర్, కలెక్టర్లు, పోలీస్, నగర కమిషనర్ ఇప్పటికే ఆయా శాఖల అధికారులకు ఏర్పాట్లు దిశానిర్దేశం చేశారు. ఆయా కేంద్రాల్లో నిమజ్జనం కోసం బల్దియా రూ.1.50 కోట్లతో నిధుల్ని వెచ్చించింది. ఇక వివిధ శాఖల అధికారులు తమ పరిధి సౌకర్యాలు కల్పించారు.
ఏర్పాట్లు ఇలా..
● మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో 32 క్రేన్లను ఏర్పాటు చేశారు. వరంగల్ చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద 7 క్రేన్లను, ఉర్సు రంగ సముద్రం 3, బెస్తం చెరువు, ఖిలా వరంగల్ అగర్తలా ఒకటి చొప్పన ఏర్పాటు చేశారు. హనుమకొండ సిద్ధేశ్వర గుండం వద్ద 3, బంధం చెరువుల వద్ద 3, హసన్‌పర్తి పెద్ద చెరువు 2, కడిపికొండ, భీమారం, చల్ల చెరువు వద్ద ఒకటి విలీన గ్రామాల్లో క్రేన్లను అందుబాటులో ఉంచారు.
● బల్దియా ఆధ్వర్యంలో రోడ్లు చదును చేసి, ప్యాచ్ వర్క్‌లు, రోడ్ల విస్తరణ ఇరువైపులకు రూ.35లక్షలు ఖర్చు చేశారు. అన్ని చెరువుల వద్ద జిగేల్‌మనేలా లైటింగ్ ఏర్పాటుకు రూ.14 లక్షలు కేటాయించారు. ఆయా ప్రాంతాల్లో మంచినీటిని సరఫరా చేసేందుకు వాటర్ ట్యాంకర్లను సిద్ధం చేశారు. పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ప్రత్యేక అధికారులను, సిబ్బందిని నియమించారు. ఐదు చోట్ల సీసీ కెమెరాలు: బల్దియా ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా ఐదు చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వరంగల్‌లోని చిన్నవడ్డేపల్లి, కోట చెరువు, ఉర్సు రంగసముద్రం, హనుమకొండ బంధం చెరువు, హసన్‌పర్తి పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేశారు.
● అదేవిధంగా అన్ని నిమజ్జన ప్రాంతాల్లో ఎన్‌పీడీసీఎల్ విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసింది. విద్యుత్ ఎం వినియోగించారో పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా పోలీసులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రధాన చెరువుల వద్ద బల్దియా జనరేటర్లను అందుబాటులో ఉంచుతారు.
● ఆర్‌అండ్‌బీ శాఖ నేతత్వంలో ఆరు కేంద్రాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు.
● మత్స్య శాఖ 1,200 మంది గజ ఈతగాళ్లు, 26 తెప్పలు, బ్యాలెన్సింగ్‌ల ద్వారా సేవలు అందించనున్నారు.
● రెవెన్యూ శాఖ ద్వారా ఐదుగురు తహసీల్దారు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది ఏర్పాట్లలో తలమునకలయ్యారు.
● మెడికల్ అండ్ హెల్త్ శాఖ ప్రతీ నిమజ్జన కేంద్రం వద్ద ఉచితంగా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా 108 వాహనాలను ఆయా సెంటర్లలో ఏర్పాటు చేయనున్నారు. గురువారం తెల్లవారు జాము వరకు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది సేవలు అందించనున్నారు.
ఆర్‌అండ్‌బీ: అన్ని చోట్ల బారికేడ్లు
● మెడికల్ అండ్ హెల్త్: ఉచిత వైద్య శిబిరాలు, 108 వాహనాలు అందుబాటులో ఉంచారు.
● పోలీస్ శాఖ: బందోబస్తు, శాంతిభద్రత పర్యవేక్షణ, ట్రా ఫిక్ నియంత్రణను పకడ్బందీగా నిర్వహించనున్నారు.
నేడు బొజ్జ గణపయ్యకు
ఘనంగా వీడ్కోలు
ప్రమాదాలకు తావులేకుండా
అన్ని శాఖలు అప్రమత్తం
నగరంలోని 19 కేంద్రాల్లో
రూ.1.50 కోట్ల నిధులతో ఏర్పాట్లు
32 క్రేన్లు, 1,200 మంది గజ ఈతగాళ్లు
ప్రధాన కేంద్రాల్లో సీసీ కెమెరాలు
పర్యవేక్షించిన మేయర్, కలెక్టర్లు,
కమిషనర్, అధికారులు
వరంగల్ అర్బన్/ఖిలావరంగల్ : గణేశ్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. గురువారం సాయంత్రం వరంగల్ నగరంలోని చిన్నవడ్డేపల్లి, ఉర్సు రంగసముద్రం, పడమరకోట మాల అగర్త, బెస్తం చెరువు, కట్టమల్లన్న చెరువుల వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను మేయర్, పోలీస్ కమిషనర్ సన్ ప్రీతీ సింగ్, వరంగల్ కలెక్టర్ సత్య శారద, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, వివిధ శాఖల అధికారుల బృందం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించింది. హనుమకొండలోని సిద్ధేశ్వర గుండం, బంధం చెరువులను కలెక్టర్ స్నేహ శబరీష్, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పర్యవేక్షించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ చెరువుల వద్ద ఏర్పాట్ల కోసం రూ.1.50 కోట్లు నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసినట్లు సీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. కమిషనరేట్ పరిధి మూడు జోన్లలో నలుగురు డీసీపీలు, ఇద్దరు అదనపు డీసీపీలు, 15 మంది ఏసీపీలు, 53 మంది ఇన్‌స్పెక్టర్లు, 70 మంది ఎస్సైలతో పాటు ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో కలిపి మొత్తం 2,100 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. ప్రత్యేకించి ట్రై సిటీ పరిధిలో 1,600 మందికిపైగా పోలీసులు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. శోభాయాత్రతోపాటు నిమజ్జనం సజావుగా కొనసాగేందుకు అధిక సంఖ్యలో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. శోభాయాత్ర నిర్వహించే మార్గంలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా శుక్రవారం నుంచి ట్రాఫిక్ మళ్లిపు కొనసాగించడంతో పాటు అన్ని ముఖ్యమైన జంక్షన్లతో పాటు ముఖ్యమైన మార్గాల్లో సిబ్బందిని నియమించినట్లు వివరించారు. ఆడియో సిస్టమ్స్ నిర్ణీత స్థాయిలో ఉయోగించాలని, డీజేలు పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు.
కోట చెరువులో నిమజ్జనం నిషేధం
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కోట చెరువులో ఈ ఏడాది కూడా గణేశ్ విగ్రహాల నిమజ్జనం నిషేధించారు. ఈ చెరువుకు బదులుగా సమీపంలో గల దేశాయిపేటలోని చిన్నవడ్డేపల్లి చెరువులో ఏర్పాట్లు చేశారు.

నిమజ్జనం.. సర్వం సిద్ధం

నిమజ్జనం.. సర్వం సిద్ధం

నిమజ్జనం.. సర్వం సిద్ధం