
7న భద్రకాళి దేవాలయం మూసివేత
హన్మకొండ కల్చరల్ : భాద్రపద శుద్ధ పూర్ణిమ ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్నందున భద్రకాళి దేవాలయాన్ని ఆరోజు మధ్యాహ్నం 1 గంటకు పూజల అనంతరం మూసివేయనున్నట్లు అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ రామల సునీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రహణమోక్షానంతరం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేసి సోమవారం ఉదయం 7గంటలకు భక్తులకు సర్వదర్శనం, ఆర్జిత సేవలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. భక్తులు గమనించాలని కోరారు.
హసన్‌పర్తి: ఎస్సారెస్పీ జలాలు గురువారం సాయంత్రం హనుమకొండ జిల్లాకు చేరాయి. చివరి (ఖమ్మం, నల్లగొండ) ఆయకట్టు వరకు నీరందించనున్నట్లు అధికారులు తెలిపారు. లోయర్ మానేరు నుంచి 3,000 క్యూసెక్కుల నీరు విడుదలైనట్లు, వార బందీ పద్ధతిలో నీటిని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఖరీఫ్ పంటకు నీరందిస్తామన్నారు.
వరంగల్ స్పోర్ట్స్: ఈనెల 7న హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ బాల్‌బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ కార్యదర్శి బేరే వీరన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఈనెల 13, 14 తేదీల్లో జనగామ జిల్లా కూనూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపా రు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఈనెల 25 నుంచి 29వ తేదీ వరకు మద్రాసులోని దిండిగల్‌లో జరగనున్న జాతీ య స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిలో క్రీడాకారులు 7న ఉదయం 9 గంటలకు జేఎన్‌ఎస్‌లోని బ్యాడ్మింటన్ గ్రౌండ్ వద్దకు ఆధార్‌కార్డుతో హాజరు కా వాలని సూచించారు. పూర్తి వివరాలకు 98492 01467లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
హసన్‌పర్తి/ ఖిలావరంగల్: హసన్‌పర్తి మండల కేంద్రంలోని సుజాత విద్యానికేతన్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆకుతోట రాంబాబు, వరంగల్ కివీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ దాసి సతీశ్‌మూర్తి(ఎస్‌ఆర్‌ఎఫ్ ఎక్స్‌లెన్స్) రాష్ట్ర స్థాయి గురు బ్రహ్మ అవార్డుకు ఎంపికయ్యారు. బుధవారం రాత్రి సురవరం ప్రతాప్‌రెడ్డి (పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ)లో నిర్వహించిన కార్యక్రమంలో లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
హన్మకొండ అర్బన్/ ఖిలా వరంగల్: రేషన్ డీలర్లకు గౌరవ వేతనం, కమిషన్ పెంపు జాప్యంపై నిరసన తెలుపుతూ.. నేడు (శుక్రవారం) రేషన్ షాపులు బంద్ చేస్తున్నట్లు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బత్తుల రమేశ్‌బాబు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జిల్లా ధారావత్ మోహన్‌నాయక్ గురువారం వేర్వేరుగా ప్రకటనల్లో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్లుగా రేషన్ డీలర్లకు రూ.5 వేల గౌరవ వేతనం, 21 నెలలు గడిచినా కమిషన్ పెంపు వర్తింపజేయకుండా జాప్యం, 5 నెలల కమిషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులను బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఐదు నెలలుగా రేషన్ షాపుల్లో పాడైపోతున్న దొడ్డు బియ్యం నిల్వలను తరలించేందుకు నిర్ణయం తీసుకోవాలని, క్వింటాలుకు రూ.140 నుంచి రూ.300కు కమీషన్ పెంచాలని డిమాండ్ చేశారు. ఒక రోజు బంద్‌తోనైనా ప్రభుత్వం స్పందించాలని, లేనిపక్షంలో తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

7న భద్రకాళి దేవాలయం మూసివేత

7న భద్రకాళి దేవాలయం మూసివేత