
మేడారం జాతరకు సమాయత్తం కావాలి
● ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ సోలమన్
హన్మకొండ: మేడారం జాతరకు ఆర్టీసీ అధికారులు సమాయత్తం కావాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్ సూచించారు. శనివారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో కరీంనగర్ జోన్‌లోని రీజినల్ మేనేజర్ల సమావేశం నిర్వహించారు. ఇందులో 2026 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరగనున్న మేడారం జాతరపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ 2024 మేడారం జాతరలో ట్రాఫిక్ జామ్‌తో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిందన్నారు. దీనికి కారణం సొంత వాహనాలు విరివిగా రావడమేనని, ప్రైవేట్ వాహనాల నిర్లక్ష్య డ్రైవింగ్‌తో ట్రాఫిక్ జామ్ అయ్యి మహిళలు, పిల్ల లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని గుర్తు చేశారు. మేడారం భక్తులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని, దీనిపై అధికారులు విస్తృత ప్రచారం చేయాలన్నారు. భక్తుల సంఖ్యకనుగుణంగా బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం ఆర్‌ఎంలు డి.విజయభాను, బి.రాజు, భవానీ ప్రసాద్, ఎ.సరిరాం, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు భాను కిరణ్, శ్రీ మహేశ్, భూపతిరెడ్డి, మధుసూదన్, ఈఈ బీఆర్ సింగ్, అకౌంట్స్ ఆఫీసర్ ఎ. రవీందర్, డిపో మేనేజర్లు ధరమ్ సింగ్, రవిచంద్ర, అర్పిత, శివకుమార్, శ్రీరాం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.