
వరంగల్ డీఈఓ(ఎఫ్‌ఏసీ)గా రంగయ్యనాయుడు
విద్యారణ్యపురి: వరంగల్ ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్‌ఏసీ) డీఈఓగా పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా విధులు నిర్వర్తిస్తున్న బి.రంగయ్యనాయుడిని నియమిస్తూ కలెక్టర్ సత్యశారద శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏడీగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే డీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. డీఈఓ ఎం.జ్ఞానేశ్వర్‌ను రిలీవ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్‌నికోలస్ ఈనెల 22న ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే.
బాధ్యతలు చేపట్టేందుకు విముఖత..
ఎఫ్‌ఏసీ డీఈఓగా బాధ్యతలు చేపట్టేందుకు రంగయ్యనాయుడు విముఖత చూపారు. ఆరోగ్య సమస్యలు ఉన్నందున విధుల్లో చేరబోనని కలెక్టర్‌కు తెలిపినట్లు సమాచారం. ఈ విషయంపై సాక్షి ఆయనను వివరణ కోరగా తాను డీఈఓగా విధుల్లో చేరబోనని స్పష్టం చేశారు. రంగయ్యనాయుడికి గతంలో వరంగల్ అర్బన్ ఎఫ్‌ఏసీడీఈ డీఈఓగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉంది.
డీఈఓ కార్యాలయం ఎదుట సంబురాలు
వరంగల్ డీఈఓ విధులనుంచి జ్ఞానేశ్వర్‌ను రిలీవ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు శనివారం హనుమకొండలోని కార్యాలయం ఎదుట సంబురాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునీల్ మాట్లాడుతూ డీఈఓ వైఖరిపై తమ సంఘం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు. టీఎస్‌ఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెరిపోతుల వంశీకృష్ణ, బాధ్యులు నాగారం మణితేజ, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కందుకూరి యువకిశోర్, ప్రధాన కార్యదర్శి రామంచ శ్రీను, కార్యదర్శి కోట నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ డీఈఓ(ఎఫ్‌ఏసీ)గా రంగయ్యనాయుడు