వరంగల్ క్రైం : ఉద్యోగులకు పదోన్నతులతోపాటు బాధ్యతలు పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన సుధాకర్, సంపత్ కుమార్, రవీందర్, కిరణ్ కుమార్, శ్రీనివాస్, జె. శ్రీనివాస్, శ్రీనివాస్‌రావు, రమేశ్, ప్రభాకర్, కిషన్ రావు, రవీందర్, ప్రభాకర్, కీర్తి నాగరాజు, నరేందర్, వెంకటస్వామి గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై సీపీ స్వయంగా పట్టీలను అలంకరించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్టేషన్‌కు వచ్చే బాధితులకు పోలీసులపై భరోసా, నమ్మకాన్ని కలిగించాలన్నారు. నిరుపేదలకు పోలీస్ అధికారులు అండగా నిలవాలని సూచించారు.
పెన్షన్, జీపీఎఫ్ అదాలత్
హన్మకొండ అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో నేడు (శుక్రవారం) పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ జరపనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ అదాలత్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పెన్షన్, జీపీఎఫ్ కేసులు, ఖాతాల సమస్యలు చర్చించి పరిష్కరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. ఆయా ఖాతాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
నడ్డాను కలిసిన ఎంపీ కావ్య
హన్మకొండ చౌరస్తా: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గురువారం ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. వరంగల్‌లో సీజీహెచ్‌ఎస్ వెల్‌నెస్ సెంటర్‌ను త్వరితగతిన ప్రారంభించాలని మంత్రి నడ్డాకు వినతిపత్రం అందించారు. సానుకూలంగా స్పందించిన ఆయన త్వరలోనే ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చినట్లు ఎంపీ కావ్య తెలిపారు.
ప్రయాణికుల నుంచి సలహాలు, సూచనలు
హన్మకొండ : మెరుగైన సేవల కోసం ప్రయాణికుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు (శుక్రవారం) ఉదయం 11గంటల నుంచి 12గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, తరిగొప్పుల, పాలకుర్తి రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్‌కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్
రామన్నపేట: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీఐసెట్ –2025 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా నేటి (శుక్రవారం) నుంచి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్‌లైన్ సెంటర్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని ఆ కళాశాల ప్రిన్సిపాల్, వరంగల్ టీజీఐసెట్ హెల్ప్‌లైన్ క్యాంప్ ఆఫీసర్ డా.బైరి ప్రభాకర్ తెలిపారు. ఈనెల 29 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, 25 నుంచి 30వ తేదీ వరకు ఆప్షన్ ఎంట్రీ, 30న ఆప్షన్ ఫ్రీజింగ్, సెప్టెంబర్ 2 తేదీ లోపు సీట్ల ప్రొవిజనల్ అలాట్‌మెంట్, 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ట్యాషన్ ఫీజు చెల్లింపు, స్వీయ రిపోర్టింగ్ ఉంటుందని వివరించారు. విద్యార్థులు తమ డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధం చేసుకొని, సమయపాలన పాటించి కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని సూచించారు.