
గంజాయి వ్యాపారం చేస్తున్న తండ్రీకొడుకులు
● 1.4కిలోల ఎండు గంజాయి స్వాధీనం
● తండ్రి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన ఎస్సై రమేష్‌బాబు
నెల్లికుదురు: తండ్రీకొడుకులు కలసి అక్రమంగా విక్రయించేందుకు తరలిస్తున్న ఎండు గంజాయిని మానుకోట జిల్లా నెల్లికుదురు పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. క్రాస్ రోడ్ వద్ద ఉదయం పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని విచారించగా.. జనగామ జిల్లా కొడకండ్ల మండలం రేగులకు చెందిన కేలోత్ చందా (కేలోత్ చందూలాల్) తన చిన్న కొడుకు కేలోత్ నవీన్‌తో కలసి తక్కువ ధరకు రాజమండ్రి నుంచి గంజాయి తీసుకొచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తేలింది. దీంతో అతని వద్ద ఉన్న రూ.70 వేల విలువ చేసే 1.4కిలో గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చందాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు.