విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు పెరిగాయి. జిల్లాలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అందులో హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 913మంది విద్యార్థులు, పరకాల ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ జనరల్‌లో 67, ఒకేషనల్‌లో 211 మొత్తంగా 278, వడ్డెపల్లి ప్రభుత్వ మహిళా పింగిలి కాలేజీలో జనరల్ 267, ఒకేషనల్ 282 మొత్తంగా 549 మంది విద్యార్థులు, హనుమకొండ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీలో 522 మంది విద్యార్థులు, హసన్‌పర్తి ప్రభుత్వ కాలేజీలో 114 మంది విద్యార్థులు, ధర్మసాగర్ ప్రభుత్వ కాలేజీలో 274 మంది, ఆత్మకూరు ప్రభుత్వ కళాశాలలో 81మంది, శ్యాయంపేట ప్రభుత్వ కళాశాలలో 76మంది, కమలాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 93 మంది మొత్తంగా ఇప్పటివరకు 2,900ల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఇందులో ఇంటర్ జనరల్ విభాగంలో 1,885 మంది, ఒకేషనల్ కోర్సుల్లో 1,015మంది అడ్మిషన్లు పొందారు.
గతేడాదితో పోలిస్తే..
హనుమకొండ జిల్లాల్లో ఆయా 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య గతేడాది కంటే ఈవిద్యాసంవత్సరంలో కొంత మేర పెరిగింది. గత సంవత్సరం కంటే 582అడ్మిషన్లు పెరిగాయి. గత విద్యాసంవత్సరం (2024–2025)ఇంటర్ జనరల్ విభాగంలో 1,430 మంది విద్యార్థులు, ఒకేషనల్ కోర్సుల్లో 888మంది మొత్తంగా 2,318మంది విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందారు. ఈ విద్యాసంవత్సరంలో 2,900లు అడ్మిషన్లతో 582 అడ్మిషన్లు పెరిగాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈనెలాఖరు వరకు గడువు ఉండడంతో ఇంకా కొంత మేర పెరగాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు.
హనుమకొండ జిల్లా ఇంటర్ కాలేజీల్లో ఆశాజనకంగా ప్రవేశాలు
గతేడాది కంటే 582 అడ్మిషన్లు అధికం