
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కుటుంబానికి చేయూత
న్యూశాయంపేట: తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యాసంస్థ(టెమ్రిస్) వరంగల్ దూపకుంట రోడ్‌లోని శంభునిపేట(జీ2) బాలికల గురుకులంలో ఔట్‌సోర్సింగ్‌లో టీజీటీ ఉర్దూ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న అజ్మీరిబేగం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. గతంలో ఆమె భర్త మృతిచెందగా ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ కుటుంబానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 16 మైనారిటీ గురుకులాల ఉద్యోగులు, సిబ్బంది చేయూత అందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రీజినల్ కో–ఆర్డినేటర్ డాక్టర్ జంగా సతీశ్, ఉమ్మడి జిల్లాలోని గురుకులాల ప్రిన్సిపల్స్ పిలుపుమేరకు టెమ్రిస్ ఉద్యోగులు రూ.5.40 లక్షలు జమ చేశారు. జమ చేసిన డబ్బులను అజ్మీరిబేగం ఇద్దరు కూతుళ్ల పేరిట మంగళవారం హనుమకొండ చౌరస్తాలోని ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి బాండ్ అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్, ఆర్‌ఎల్‌సీ డాక్టర్ సతీశ్, ప్రిన్సిపాళ్లు తాళ్ల నీలిమాదేవి, ఇ.శ్రీపాల, డి.కృష్ణకుమారి, రమేశ్‌లాల్ హట్కర్, రవికుమార్, విజిలెన్స్ అధికారులు సయ్యద్ అక్బర్, మక్బూల్‌పాషా, వార్డెన్ ఉజ్మా తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.